హైదరాబాద్‌లో లాక్డౌన్ ఊహాగానాలు : రూ.వెయ్యికోట్లకు మద్యం అమ్మకాలు
హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా గణనీయంగా పెరిగాయి. ఫలితంగా గత నెలాఖరులో ఏకంగా రూ.1000 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా, జూన్ 26 నుంచి 30 మధ్య రూ.973.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
జూలై 1 నుంచి లాక్డౌన్ విధిస్తే, ఎక్కడ షాపులు మూతపడతాయేమోనన్న కంగారుతో మందుబాబులు పెద్ద మొత్తంలతో మద్యం కొని నిల్వ చేసుకున్నారు. మొత్తమ్మీద కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఎంతో చేయూతనిస్తోందని చెప్పొచ్చు.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జీఎస్టీ, రిజిస్ట్రేషన్ల కంటే మద్యం విక్రయాలే ఎక్కువ ఊరట కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల రాబడి సమకూరింది. జూన్ నెలాఖర్లో అమ్మకాలు గణనీయంగా పెరగ్గా ఈ నెల 1 నుంచి 4 వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అమ్మకాలున్నాయి.
లాక్డౌన్ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో రూ.1864 కోట్ల రాబడి వచ్చింది. జూన్‌లో రూ.1955 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో మద్యం దొరక్క ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మందు బాబులు మద్యం కొనుగోలు కోసం ఎగబడ్డారు.