మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 31 అక్టోబరు 2018 (20:37 IST)

కోడి కత్తి దాడి: జగన్‌ని ఫోన్లో పరామర్శిద్దామనుకున్నా... కానీ: బాబు

తెలుగుదేశం పార్టీ  సభ్యత్వ నమోదు కార్యక్రమ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ దేశంలో టీడీపీ తప్ప వేరే పార్టీ లేదన్నారు. ప్రమాదవశాత్తూ కార్యకర్తలు ఎవరైనా మరణిస్తేవారి పిల్లల బాధ్యతను పార్టీనే తీసుకుంటుందని పెద్ద దిక్కు కొల్పోయిన కార్యకర్తల కుటుంబాల్లోని పిల్లలు పెద్దవారు అయ్యేంత వరకు పార్టీ  చేయూతనిస్తుందని తెలియజేశారు.
 
అవినీతితో డబ్బు సంపాదించుకోవడం తప్పు అనే విషయాన్ని ప్రతి కార్యకర్త గమనించి పార్టీ అభివృద్ధికి పాటు పడాలని కార్యకర్తల ఆర్ధిక ఎదుగుదలకు కావాల్సిన చేయూత కచ్చితంగా పార్టీ చూసుకుంటుందని అన్నారు. టిడిపి కార్యకర్త ఇల్లంటే.. సేవకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండాలన్నారు.  2019లో పార్టీ గెలుపు చారిత్రక అవసరం అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ప్రతి కార్యకర్త తెలియజేయాలన్నారు. 
 
ఎయిర్‌పోర్టులో కోడి కత్తి ఎపిసోడ్ ఏంటో ప్రజలకు తెలుసని, జగన్ వీరాభిమానే ఈ దాడి చేశారు. సానుభూతి కోసం ఇలా దాడి చేశానని స్వయంగా నిందితుడే చెబుతున్నాడు అన్నారు చంద్రబాబు. ఫోన్ చేసి జగన్‌ను పరామర్శిద్దామనుకున్నా, నేను ఫోన్ చేసేలోగానే నన్ను ఏ1 నిందితుడు అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. 
 
నేరాలను కంట్రోల్ చేసేవాడినే కానీ నేరాలను పురికొల్పే వాడిని కాను అని చంద్రబాబు అన్నారు. కోడి కత్తి ఎపిసోడును ఎలా కవర్ చేసుకోవాలో వైసీపీకి అర్ధం కావడం లేదని, అందుకే తప్పించుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిపై దాడికి వైసీపీ ప్లాన్ చేసిందో.. లేదో కానీ.. టీడీపీ మాత్రం చేయలేదు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం అన్నారు చంద్రబాబు.