ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన భర్తకు ప్రమాదం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయింది. వెంటనే అక్కడున్న భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. యనమలకుదురుకు చెందిన వెలగపూడి సీత అనే మహిళ సోమవారం సీఎం నివాసం వద్దకు వచ్చింది.
తన భర్త అధికార టీడీపీలో క్రియాశీల నాయకుడిగా ఉండేవాడని పేర్కొంది. ఇటీవల తన భర్తకు ప్రమాదం జరుగగా.. చికిత్స చేయించేందుకు దాదాపు రూ. 20 లక్షలు ఖర్చయ్యాయని తెలిపింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చిన డబ్బులు ఏమాత్రం సరిపోలేదని.. అందుకే తన భర్తను కాపాడుకునేందుకు సహాయం చేయాల్సిందిగా ఐదు నెలలుగా సీఎం ఇంటి చుట్టూ తిరుగుతున్నాని తెలిపింది.
అయినప్పటకీ తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడమే కష్టంగా ఉందని.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపింది.