సినిమాల్లో చూపించేవిధంగా నన్ను రేప్ చేశారు: పృథ్వీరాజ్
"ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని విన్నాం. అదే తరహాలో నా పక్కనే ఉంటూ కొంతమంది నాపై కుట్ర చేసి వెన్నుపోటు పొడిచారు. సినిమాల్లో చూపించేవిధంగా రేప్ చేసి వదిలారు. ఇక్కడున్న నాయకులెవరో కూడా నాకు తెలీదు. నాపై వారికి ఎందుకో అంత కక్ష?" అని ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన చుట్టూ తిరిగినవారే తనను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల కాలంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను.
చాలా ఆవేదనతో తిరుమలకు వచ్చా. ఒక మనిషిని తాత్కాలికంగా బాధపెట్టి బయటకు పంపినా, నిజం ఏదో ఒకరోజు బయటపడుతుంది’ అన్నారు. 11 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన నేపథ్యంలోనే సీఎం తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆ రోజే ఆ పదవి వద్దని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
‘బాగా పనిచేయండి, కావాలంటే సీఎం కాళ్లు పట్టుకుని ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తానని ఉద్యోగులతో చెప్పినందుకు నాకు ఐదు నెలల పదవీకాలంలో యాభైఏళ్ల జీవితాన్ని చూపారు. నేను చనిపోతే కూడా ఇవ్వనంత పబ్లిసిటీ మీడియాలో ఇచ్చేశారు.
ఎవరూ ఒత్తిడి చేయకపోయినా నిజాయితీ కలిగిన వ్యక్తిగా పదవికి రాజీనామా చేశా. తను వెళ్లిపోయిన తర్వాత చాలామంది ఆనందంతో పార్టీలు చేసుకున్నారు. "కర్రలు, రాళ్లతో కొట్టినా పర్వాలేదు, కానీ జీవితంపై కొట్టడం దారుణం. గత కొన్ని నెలలుగా మాంసం, మద్యం తీసుకోలేదు. ఇందుకు రుజువుగా తీయించిన రక్త నమూనాల నివేదికను త్వరలో సీఎంకు అందజేస్తా.
ఎలాంటి తప్పు చేయకపోయినా కొందరు నన్ను దారుణంగా తిట్టారు. సీఎం జగన్ నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. చనిపోయిన తర్వాత కూడా నాపై వైసీపీ జెండానే ఉంటుంది" అన్నారు. ఆరోపణలపై విచారణను స్వాగతిస్తున్నానని చెప్పారు. రైతులపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.
‘లౌక్యం సినిమాలో నటించాను కానీ, నాకు లౌక్యం తెలియదు. అది తెలిస్తే మరో పదేళ్లు ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉండేవాడిని’ అని వ్యాఖ్యానించారు.