మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జులై 2020 (17:37 IST)

భూములన్నీ అమ్మేస్తే, భవిష్యత్ లో నిర్మాణాలు ఎలా చేస్తారు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అప్పుచేసి పప్పుకూడు తింటున్న ప్రభుత్వం అది చాలదన్నట్లుగా ప్రభుత్వ భూములు అమ్మాలని చూడటం, ఆసొమ్ముని అభివృద్ది కార్యక్రమాలకు కాకుండా పందేరానికే ఉపయోగిస్తామని చెప్పడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆక్షేపించారు.

గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజోపయోగ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేయాలంటే భవిష్యత్ లో ఎక్కడా ప్రభుత్వ భూములు దొరికే పరిస్థితి లేదని, ఉన్న భూములను అమ్మేస్తే భవిష్యత్ లో వచ్చే సమస్యలకు ఎవరు బాధ్యులో ఈప్రభుత్వం చెప్పాలన్నారు.  ముందుచూపు లేకుండా చేసే పనులు ఎప్పటికైనా ప్రమాదకరమేనన్నారు.

రాజమండ్రిలో ఇప్పటికీ చెత్తవేయడానికి సరైన ప్రదేశం లేదని, ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో డంపింగ్ యార్డు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు, ప్రజలకు ఉపయోగపడే సామాజిక భవనాలు, అంగన్ వాడీలు, ఆసుపత్రులు నిర్మించాలంటే భూములు లేకపోతే ఎలా అని బుచ్చయ్య ప్రశ్నంచారు.

కేంద్రం ఇచ్చే ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా భూములు  లేని దుస్థితి వచ్చిందన్నారు. దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్ భూములను అమ్ముకోవడం, భూ సమీకరణ చేసి నిర్మించిన రాజధానిని నిర్మూలించడం వంటి చర్యలు ఎంతమాత్రం సరికాదన్నారు. ఈ ప్రభుత్వం బోగాపురం ఎయిర్ పోర్టు, మచిలీపట్నం ఓడరేవుకు ఇచ్చిన భూములను వెనక్కు లాక్కొందన్నారు.

ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను అమ్ముతామంటే ఎవరూ చూస్తూఊరుకోరని, ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకొని ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బుచ్చయ్య స్సష్టంచేశారు.