గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 25 ఆగస్టు 2021 (12:47 IST)

తిరుమ‌ల‌లో మెరుగైన శానిటేష‌న్‌కు ఐఐటి నిపుణుల సూచ‌న‌లు

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణలో రాజీ ప‌డ‌కూడ‌ద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలో ఆరోగ్య విభాగం అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లో మెరుగైన శానిటేష‌న్ కోసం ఐఐటి నిపుణుల స‌ల‌హాలు తీసుకుంటున్నామ‌న్నారు.
 
ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమ‌ల‌కు వేలాదిగా విచ్చేసే భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప‌రిశుభ్ర‌తపై ఎక్కువ దృష్టి సారించాల‌న్నారు. ప్ర‌స్తుతం ఉద‌యం 5 గంట‌ల నుండి తిరుమ‌ల‌లో రోడ్ల‌ను శుభ్రం చేస్తున్నార‌ని, దానిని తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల‌ నుంచి ప్రారంభించాలన్నారు. త‌ద్వారా ఉద‌యానికల్లా  రోడ్ల‌న్నీ ప‌రిశుభ్రంగా ఉంచేందుకు వీల‌వుతుంద‌న్నారు. తిరుమ‌ల‌లోని ఆరోగ్య విభాగానికి చెందిన 7 వార్డుల్లో త‌గినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది, వ‌ర్క‌ర్లు ఉన్నార‌ని, వారిపై మేస్త్రీలు, శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లు పక్కా ప్ర‌ణాళిక‌తో పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. ప‌రిశుభ్ర‌త విష‌యంలో చిన్న ఫిర్యాదులు కూడా రాకుండా జాగ్ర‌త వ‌హించాల‌ని చెప్పారు. రోడ్ల‌పై కుప్ప‌లుగా ఉండే చెత్త‌ను డ‌స్టు బిన్లు, గ‌న్ని బ్యాగ్స్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించి త‌ర‌లించాల‌ని ఆదేశించారు.  
 
ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్ల‌లో వ‌చ్చే చెత్త‌ను రెండు రోజులకోసారి యంత్రాల స‌హాయంతో శుభ్రం చేయాల‌న్నారు. ప్ర‌స్తుతం ఆరోగ్య విభాగం ఉప‌యోగిస్తున్న యంత్రాలు వాడుకుంటూ, ఆధునిక యంత్ర ప‌రిక‌రాల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల‌న్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న శానిట‌రి సిబ్బందికి ఎలాంటి ప్ర‌మాదాలు క‌లుగ‌కుండా వారికి రేడియం జాకెట్లు అందివ్వాల‌న్నారు.
 
తిరుమ‌ల‌లో ప‌రిశుభ్ర‌త‌ను మ‌రింత మెరుగుప‌ర్చ‌డానికి ఐఐటి నిపుణులను ఆహ్వానించి వారి సూచ‌న‌లు  తీసుకోవాల‌న్నారు. అదే విధంగా ఐఐటి వారి స‌హ‌కారంతో టిటిడి ఆరోగ్య విభాగంకు ఎంత మంది సిబ్బంది అవ‌స‌రం, ప్రమాణాలు, యంత్ర ప‌రిక‌రాలు త‌దిత‌ర అంశాల‌పై స‌మ‌గ్ర నివేదిక రూపొందించి అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.