శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (08:57 IST)

అమ్మా.. నేను చదవలేకపోతున్నా... నేను చనిపోతున్నా... ఓ విద్యార్థి ఆత్మహత్య

suicide
అమ్మా.. నేను చదవలేకపోతున్నా... ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా ఒకటే, చనిపోయినా ఒకటే.. అంటూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు తన తల్లికి ఆత్మహత్య లేఖ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. అమ్మా... నన్ను క్షమించు అంటూ పేర్కొన్నాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ధనలక్ష్మీపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... 
 
ముత్తుకూరులోని ఆర్ఆర్ కాలనీకి చెందిన దువ్వూరు హరినాథ్ రెడ్డి, అనితల పెద్ద కుమారుడు పణత్ ధనలక్ష్మీపురంలోని వీబీఆర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజనానికి వచ్చిన పణత్ తిరిగి తరగతి గదికి కాకుండా హాస్టల్ గదికి వెళ్లాడు. అక్కడే ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి క్లాసుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది గదిలో చూడగా తాడుకు పణత్ వేలాడుతూ కనిపించాడు. 
 
దీంతో అతడిని కిందికి దించి హుటాహుటిన సమీపంలోని నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే పణత్ మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం ముత్తుకూరులోని పణత్ తల్లిదండ్రులకు చేరవేసింది. వారంతా హాస్పిటల్‌కు చేరుకుని విగతజీవిగా పడిఉన్న పణతు చూసి బోరున విలపించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని వీబీఆర్ స్కూల్‌కు తరలించారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు, ఆందోళనలతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఒత్తిడి వల్లే తమ బిడ్డ ప్రాణాలు తీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.