గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (14:45 IST)

ప్రకాశం జిల్లాలో 500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లెదర్ పార్క్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్రకాశం జిల్లాలో 500 ఎకరాల్లో ' ఇంటర్నేషనల్ లెదర్ పార్క్'ను ఏర్పాటు చేయనున్నామని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ( లిడ్ క్యాప్ ) ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ ప్రకటించారు. తాడేపల్లిలోని లిడ్ క్యాప్ కార్యాలయంలో చర్మకారుల అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న కార్యక్రమ వివరాలను ఆయన తెలియజేశారు.
 
 
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం లిడ్ క్యాప్ ను నిర్వీర్యం చేసిందని, అడ్డగోలు విధానాలతో అవినీతికి పాల్పడిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగ సామాజికవర్గ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇంటర్నేషనల్ పార్క్ వలన దాదాపు 10 వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామ‌ని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, లిడ్ క్యాప్ కు సంబంధించిన ఆస్తులన్నింటిని పరిశీలిస్తామ‌న్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందినవారిని ఏఏ పథకాల ద్వారా వాళ్ల సమస్యలను పరిష్కరించి, వారిని ఆర్థికంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతామో అధ్యయనం చేశామని రాజశేఖర్ వివరించారు. ఈ జాతికి మేలు చేసేందుకు కార్యక్రమాల నివేదికను త్వరలో ముఖ్యమంత్రికి అందజేస్తామని ఆయన తెలిపారు. 
 
 
గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లిడ్ క్యాప్ నిర్వీర్యం చేశారని .. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.  గతంలో 100 కోట్లు కేటాయించి, 40 కోట్లు విడుదల చేసి, 25 కోట్లు వెనక్కి తీసుకునే రూ.10 కోట్లు మాత్రమే అందించారని వారిలో కూడా అనర్హులు ఉన్నారన్నారు. లిడ్ క్యాప్ ను తిరిగి అభివృద్ధి చేయడానికి  రాష్ట్రవ్యాప్తంగా ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  సెంటర్ల ద్వారా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రైనింగ్ సెంటర్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ .20.58 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఎడవల్లి , కృష్ణా జిల్లా జి.కొండూరు, చిత్తూరు జిల్లా తిరుపతి , విజయనగరం జిల్లా అడ్డపూసలలో 20 కోట్ల నిధులతో శాశ్వత ప్రతిపాదికన ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 
 
 
ఈ  నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఆటో నగర్ వద్ద ఎకరం స్థలంలో అన్ని హంగులతో శాశ్వతంగా లిడ్ క్యాప్ భవన్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోసం చూస్తున్నామని, అనుమతి వచ్చిన వెంటనే భవన నిర్మాణ పనులు చేపడుతామన్నారు. 
 
 
రాష్ట్రవ్యాప్తంగా వీధుల్లో, పుట్ పాత్ లపై చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తూ, శ్రమించే చర్మకారుల గురించి ఆలోచనలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అలా జీవించే వారికి ఎక్కడ ఉన్న వారికి అక్కడే వసతులు కల్పిస్తూ సోలార్ పవర్ తో ఫ్యాన్, లైట్లు నడిచే విధంగా బంకులు నిర్మించాలని ప్రణాళిలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గతంలో కోటి రూపాయల టర్నోవర్ ఉన్న వారు మాత్రమే ప్రభుత్వానికి కాంట్రాక్టుటు చేసుకునే అవకాశం ఉండేదని .. ఇప్పుడు కోటి నుంచి 25 లక్షలకు తగ్గించి ఎక్కువ మంది దళితులు ఎస్ రోల్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీసు, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ వంటి ప్రభుత్వశాఖలకు ప్రభుత్వం ద్వారా సప్లై చేయబడుతున్న షూస్, బ్యాగ్స్ వంటి లెదర్ గూడ్స్ అన్నీ లిడ్ క్యాప్ ద్వారా సప్లై చేయాలని ముఖ్యమంత్రిని కోరామ‌న్నారు. దానికి ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. తిరుపతిలో లిడ్ క్యాప్ భూముల ఆక్రమణకు గురయ్యాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రికార్డులు పరిశీలిస్తే, లిడ్ క్యాప్ కు ఆనుకుని ఉన్న భూములే తప్ప లిడ్ క్యాప్ భూములు కాదని  స్ప‌ష్టం చేశారు.