శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మే 2020 (14:33 IST)

వెయ్యి మంది ప్రాణాలు కాపాడిన ఐపీఎస్... సీఎం జగన్ బంపర్ ఆఫర్

విశాఖపట్టణం జిల్లా శివారు ప్రాంతమైన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ఇటీవల విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా, ఈ విషవాయువు ఐదు గ్రామాలకు వ్యాపించింది. దీంతో ఈ గ్రామాల ప్రజలందరినీ ఖాళీ చేయించారు. 
 
అయితే, ఈ దుర్ఘటన వేకువజామున 3.30 గంటల సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విశాఖపట్టణం జోన్-2 డీసీపీ బిల్లా ఉదయ్ భాస్కర్ వెంటనే ఇతర పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా, పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైరన్ మోగించుకుంటా గ్రామాల్లో చక్కర్లు కొట్టాలని ఆదేశించారు. డీసీపీ ఆదేశాల మేరకు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు గ్రామాల్లో తిరుగుతా గాఢనిద్రలో ఉన్న ప్రజలు నిద్ర లేచేలా చేశాయి. 
 
ఆ వెంటనే వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు మైకుల్లో ప్రకటన చేస్తూ ముందుకుసాగారు. డీసీపీ ఉదయ భాస్కర్ తీసుకున్న చొరవ వల్ల, ప్రదర్శించిన ధైర్య సాహసాల వల్ల సుమారు వెయ్యి మంది ప్రజలు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి చేరింది. వెంటనే డీసీపీ ఉదయ భాస్కర్‌ను అభినందిస్తూ, ఆయన పేరును ప్రతిష్టాత్మక భావించే ప్రెసిడెంట్ మెడల్‌కు సిఫార్సు చేయాల్సిందిగా డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు.