ఆవేశానికి లోనుకావొద్దు... సింహం మళ్లీ గాండ్రిస్తుంది.. నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రులతో పాటు సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో పవన్ ఫ్యాన్స్‌తో పాటు జనసైనికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం అమరావతిలో జరిగింది. ఇందులో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఏ ఒక్క జనసైనికుడు ఆవేశానికి లోనుకావొద్దంటూ పిలుపునిచ్చారు. అన్ని విమర్శలకు పవన్ కళ్యాణే స్వయంగా తగిన రీతిలో సమాధానమిస్తారని చెప్పారు.
సమాజాంలోని ప్రతి ఒక్క వ్యక్తిని పవన్ కల్యాణ్ గౌరవిస్తారని చెప్పారు. ఆయన కష్టపడి జనసేన పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. సినిమా పరిశ్రమకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ అడిగారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇండస్ట్రీని కాపాడమంటే పవన్‌ను కాపాడమని అర్థం కాదని ఆయన గుర్తుచేశారు.
పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవన్‌పై కొందరు వ్యక్తిగత దాడి చేస్తున్నారన్నారు. జనసైనికులు, పవన్ అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోవద్దని, దృష్టిని మళ్లించడానికే కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆయన చెప్పారు.
సమాజంలోని పౌరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2019లో వైసీపీ నేతలు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేకమంది జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారని, పార్టీలో చేరుతున్నారని నాదెండ్ల చెప్పారు. వారిని కలుపుకొని జనసేన నేతలు, కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా కమిటీ, యువజన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై ఎటువంటి సందర్భంలోనూ రాజీ పడకూడదని నాదెండ్ల చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అంతేగానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు.