మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (18:16 IST)

టైమ్ ఓవర్.. కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణ..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గడువు నేటితో ముగిసింది. నామినేషన్లకు ఈ రోజు చివరిరోజు కావడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి అధినేత కేఏ పాల్‌కు భారీ షాక్ తగిలింది. నామినేషన్ సమయం ముగియడంతో ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. 
 
అయితే భీమవరంలో నామినేషన్ వేసేందుకు పాల్ వచ్చారు. కానీ నామినేషన్ వేసే సమయం అప్పటికే అయిపోతుంది. ఆలస్యంగా వచ్చారంటూ పాల్ నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. పాల్ మాత్రం దీనిపై అధికారులకు వివరణ ఇచ్చుకుంటూ నరసాపురంలో ఎంపీ నామినేషన్‌ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం వచ్చేసరికి లేట్ అయిందని పేర్కొన్నారు. 
 
తనపై టీడీపీ అధినేత చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కుట్ర పన్నారని పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను గెలుస్తానన్న భయంతో భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేసారని కేఏ పాల్ విమర్శించారు. 
 
అయితే నరసాపురంలో మాత్రం తాను భారీ మెజారీటీతో గెలిచి కేఏ పాల్ అంటే ఏంటో చూపిప్తానని పాల్ ప్రత్యర్థులకు ఛాలెంజ్ చేసారు. కాగా రేపు నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఉపసంహరణకు ఈ నెల 28 వరకూ గడువు ఉంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనుంది.