మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 6 నవంబరు 2018 (18:28 IST)

కర్నాటక ఫలితాలతో బీజేపీకి, మోడికి చావు దెబ్బ...

అమరావతి : కర్నాటకలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడికి చావు దెబ్బ వంటివని ఏపీ శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అభిప్రాయపడ్డారు. కర్నాటక ఎన్నికల ఫలితాలే త్వరలో జరగబోయే తెలంగాణా సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబుతో కలిసి ఆయన మాట్లాడారు. 
 
కర్నాటకలో మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయన్నారు. వాటిలో రెండు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గెలుచుకుందన్నారు. ఇది చారిత్రిక విజయమన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరుకున్నారన్నారు. కొద్ది నెలల కిందట జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అక్కడి తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
 
తెలుగు ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో బీజేపీ, పీఎం నరేంద్ర మోడికి కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి తెలిసొచ్చేలా చేశాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహ రచనకు బీజేపీ విలవిలలాడిపోతోందన్నారు. 2014 ఎన్నికల్లో అభివృద్ధి అజెండాగా సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి బీజేపీ, ప్రధాని నరేంద్రమోడి ప్రజల ముందుకెళ్లారన్నారు. 
 
ఏపీ పునర్విభజన చట్టం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పీఎం నరేంద్రమోడి ముఖం చాటేయడంతో, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి వ్యూహరచనకు తాళలేక, అభివృద్ధి అజెండా వదలి బీజేపీ నాయకులు మత రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్నారని శాసనమండలి విప్ డొక్కా మాణిక్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.