1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (10:09 IST)

జగన్ బతికుండగా.. సీఎం సీట్‌ను టచ్ చేసేవాడు లేడు: కొడాలి నాని

జంగారెడ్డిగూడెం మృతుల పట్ల రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తారస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.
 
తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు. 
 
జంగారెడ్డిగూడెంలో 25 మంది నాటు సారా తాగి మరణించారు అంటూ.. చంద్రబాబు.. శవాల మీద చిల్లర ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. 
 
చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బు లక్ష రూపాయలు ఇస్తానని అంటున్నారు, ముఖ్యమంత్రి అయితే రూ.25 లక్షలు ఇస్తానని చెబుతున్నారు అని ఫైర్ అయ్యారు. 3వ తేదీన నుండి చనిపోతే, కల్తీ మద్యం తాగి చనిపోయారని పోలీస్ కేసు పెట్టాలి కదా అని ప్రశ్నించారు.    
 
కమ్మలు.. జగన్‌కు వర్గ శత్రువు అని పవన్ కళ్యాణ్ అంటాడు, కాపులు చంద్రబాబును సీఎం చేయాలంటాడు అని కొడాలి నాని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో జగన్‌కు వ్యతిరేకంగా 160 సీట్లలో పోటీ చేసే ఒక్క మగాడు ఉన్నా నేను రాజకీయాలు వదిలేస్తా అని కొడాలి నాని చాలెంజ్ చేశారు. 
 
ఏ రాజకీయ పార్టీలో అయినా ఈ రాష్ట్రంలో 160 సీట్లలో పోటీ చేయగల మగాడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. జగన్ బతికుండగా.. సీఎం సీట్‌ను టచ్ చేసేవాడు లేడని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్లలో సొంత అభ్యర్థులతో పోటీ చేసే సత్తా ఒక్క వైసీపీకి మినహా మరే ఇతర పార్టీకి లేదని మంత్రి కొడాలి నాని చెప్పారు.