భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమన్న వైసీపీ నేత జ్యేష్ఠ రమేష్ బాబు
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, అటువంటి మగువకు దేవాలయం లాంటి అసెంబ్లీలో అవమానం జరిగింది. ఇది ముమ్మాటికీ తప్పే, భావితరానికి ముప్పే. ప్రజాస్వామిక వాదులంతా ఖండించాల్సిన అంశమే అని కృష్ణా జిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు వ్యాఖ్యానించారు. ఎన్టీయార్ తనయ నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమన్నారు.
నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు టీడీపీకి అనుకూలంగా ఈ వ్యాఖ్యలను ఇప్పుడు చేయడం సంచలనంగా మారింది. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దేశ రాజధాని నడి వీధుల్లో తాకట్టుపెడుతున్నారని, దానిని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ కుమార్తెకే సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలో అవమానం జరగటం బాధాకరమన్నారు.
వ్యక్తి ఎవరైనా, పార్టీ ఏదయినా మహిళలపై బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని రమేష్ బాబు చెప్పారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఎన్టీఆర్ తన కుమార్తెలను ఒక క్రమశిక్షణతో పెంచుకున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అటువంటి ఆయన కుమార్తె పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.
ఎన్టీయార్ మహిళలలో ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించటంతో పాటు వారికి అన్ని రంగాలలో సముచితస్థానం కల్పించారని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు వివరించారు. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు కానీ, దానికి కూడా ఒక భాష ఉంటుందన్నారు. కానీ ఇలా వ్యక్తిగత కక్షలతో సంబంధం లేని వారిని తమ పదవులను కాపాడుకోవటానికి విజ్ఞత మరచి, విచక్షణ కోల్పోయి ఉన్మాదుల మాదిరిగా మాట్లాడటం తగదన్నారు. దానిని నాయకుడు కూడా సమర్ధించడం ఎంతవరకు సమంజసమొ వారే ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్టాడారు.
ఇటువంటి మాటలు, సంఘటనలు వారికి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో కానీ, దాని పర్యవసానం రాబోయే రోజుల్లో ప్రజలలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో కూడా తెలుసుకోవాలన్నారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష హుందాగా వుండాలే కానీ, బాధ్యతారాహిత్యంగా ఉండకూడదని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు.