గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 26 నవంబరు 2021 (16:30 IST)

ఎమ్మెల్యే జోగి వర్సెస్ ఎమ్మెల్యే కేపి? కొండ‌ప‌ల్లి వైఎస్సార్ సీపీలో రాజీనామాల పర్వం

నిన్న కాక మొన్న ఎన్నిక‌లు జ‌రిగిన కృష్ణా జిల్లా కొండ‌ప‌ల్లిలో వైఎస్సార్ సీపీలో రాజీనామాల పర్వం మొద‌లైంది. ఇబ్రహీంపట్నం వైసిపి లో నివురుగప్పిన నిప్పులా వర్గపోరు న‌డుస్తోంది. ఇక్క‌డి స్థానిక ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్, కేపితో అమీ తుమీ తేల్చుకోవడానికి క్రింది స్థాయి నాయకత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

 
రాజ‌కీయంగా విశ్వాసనీయ సమాచారం ప్రకారం కేపి పైన పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ వర్గీయులు గరం గరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉండే జోగి కుటుంబానికి చెక్ పెట్టే విధంగా కేపి పావులు కదుపుతున్నారంటూ జోగి వర్గీయులు మండిపడుతున్నారు. కానీ, కేపీ అనుచ‌రులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. కానీ అది కేవ‌లం ఉన్నత శ్రేణి నాయకత్వం మాట‌లే, కింది స్థాయిలో మాత్రం ఆ స‌మ‌న్వ‌యం కొర‌వ‌డింది.

 
ఇంచార్జుల పాలనతో కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో వైసిపి అగ్ర‌నేత‌లు కింది స్థాయి నాయకత్వానికి కళ్లెం వేశారంటూ ఆరోపణల వెల్లువెత్తుతున్నాయి. కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జోగి రమేష్ ను ప్రచారానికి పిలువలవకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏమిటో చెప్పాల‌ని జోగి సానుభూతి పరులు ప్ర‌శ్నిస్తున్నారు. 

 
తెలుగు దేశం పార్టీ కొండపల్లి లో దేవినేని ఉమాకు బలం చేకూర్చేలా స్థానికంగా ఉన్న తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్యతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజా,  బొమ్మసాని సుబ్బారావు, కాజా రాజ్ కుమార్ లు వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీ గెలుపునకు కృషి చేశారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అధికారపార్టీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించిందని, సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

 
ఈ వివాదం ముదిరి ఇపుడు తాజాగా , మైలవరం మండలంలో బి. సి. కమ్యూనిటీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పామర్తి శ్రీను  మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మెన్ పదవికి, వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్ష పదవికి  రాజీనామా చేశారు. కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల తరువాత వైఎస్సార్ సీపీ లో నెలకొన్న పరిస్థితులే పామర్తి శ్రీనివాసరావు రాజీనామాకు కారణ‌మ‌ని తెలుస్తోంది.