బర్త్‌డే పార్టీలో వేసిన లేజర్ లైట్లతో విమానానికి చుక్కలు చూపాడు..
హైదరాబాద్ శివారులో ఉన్న శంషాబాద్ మండలంలోని రషీద్‌గూడ గ్రామంలో ఓ యువకుడి బర్త్‌డే వేడుక విమానం నడుపుతున్న పైలెట్‌కి చుక్కలు చూపించింది. ఎయిర్‌పోర్ట్ అధికారులను పరుగులు పెట్టించింది. గత శనివారం రాత్రి రషీద్‌గూడ గ్రామానికి చెందిన ఓ యువకుడు తన బర్తడే వేడుకల్లో లేజర్‌లైటింగ్, డీజే పాటలతో హోరెత్తించాడు. కాగా రషీద్‌గూడ గ్రామం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అత్యంత సమీపంలో ఉండడంతో లేజర్‌లైటింగ్ ఫోకస్ వల్ల విమానాల పైలెట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అదే రోజు రాత్రి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా లేజర్ లైటింగ్ వెలుగులు పైలెట్ కళ్లపై పడడంతో రన్‌వే కనిపించలేదు. దాని వల్ల విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసేందుకు పైలట్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతికష్టం మీద విమానాన్ని పైలెట్ సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయాన్ని పైలట్ ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేసాడు. పైలెట్ ఫిర్యాదుతో ఖంగుతిన్న ఎయిర్‌పోర్ట్ అధికారులు సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఎయిర్‌పోర్ట్ చుట్టూ 15 కిలోమీటర్ల మేర లేజర్‌షో లైటింగ్‌లను నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో అనధికారికంగా పెద్ద ఎత్తున కన్వెన్షన్ హాల్‌లు వెలిశాయి. ఈ కన్వెన్షన్ హాల్‌లను ఏదైనా వేడుక జరిగే సమయంలో ఇష్టారాజ్యంగా రాత్రివేళల్లో లైజర్ లైట్‌ల వెలుగుతో యువకులు హంగామా చేస్తుండడం సర్వ సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఎయిర్‌పోర్ట్ పరిసరాలలో 15 కిలోమీటర్ల పరిధిలో లేజర్‌లైటింగ్ షోలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లోని కన్వెన్షన్ హాల్‌లకు అధికారులు నోటీసులు జారీ చేసారు.