గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (18:28 IST)

శ్రీకాళహస్తిలో 'శివగామి'.. అక్కడ ఆమె మాటే శాసనం... ఎవరో తెలుసా?

ఆ అధికారి రూటే సపరేటు. అక్కడ ఆమె చెప్పిందే వేదం. ఆమె మాట వినకపోతే అంతేసంగతులు. అస్మదీయులకు అందలం.. తస్మదీయులకు ఆశాభంగం. ఇది అక్కడి తీరు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏమిటా కథ.. తెలుసుకోవాలంటే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళ్లాల్సిందే.

ఆ అధికారి రూటే సపరేటు. అక్కడ ఆమె చెప్పిందే వేదం. ఆమె మాట వినకపోతే అంతేసంగతులు. అస్మదీయులకు అందలం.. తస్మదీయులకు ఆశాభంగం. ఇది అక్కడి తీరు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏమిటా కథ.. తెలుసుకోవాలంటే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళ్లాల్సిందే.
 
ఇప్పటిదాకా చెప్పిన పరిచయం అంతా శ్రీకాళహస్తీశ్వరాలయ ఆలయ ఈఓ భ్రమరాంబ గురించి. కార్యనిర్వహణాధికారిగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అడుగు పెట్టింది మొదలు ప్రతి అంశంలోను ఆమె వ్యవహరించే తీరు వివాదాస్పదంగా మారుతుంటాయన్న విమర్శలు వస్తూనే వున్నాయి. ఆలయ ఛైర్మన్ నుంచి అటెండర్ దాకా అందరూ ఆమె మాట వినాల్సిందేననీ, లేదంటే తనదైన స్టైల్లో సదరు ఉద్యోగులకు చెక్ పెట్టి సాగనంపడం ఈఓకు ముందు నుంచి అలవాటనే ఆరోపణలున్నాయి. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఈసారి ఏకంగా మీడియాకే హెచ్చరికలు జారీ చేశారు ఈఓ భ్రమరాంబ. 
 
బెయిల్ కోసం జైలు నుంచి విడుదలయ్యే ఖైదీల తరహాలో మీడియా ప్రతినిధుల దగ్గర బైండోవర్ తరహా పేపర్ల మీద సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ మీడియా ఎందుకు ఈఓకు అంగీకార పత్రాలు ఇవ్వాలనేకదా మీ సందేహం. మరేం లేదు. ఈ మధ్యకాలంలో ఆమెకు వంతపాడని మీడియాను చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు భ్రమరాంబకు వచ్చిన కొత్త తరహా ఆలోచన ఇది. ఈ నెల 8 నుంచి ప్రారంభం కాబోయే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి పొరపాట్లు ఏవైనా జరిగితే దాని గురించి వాస్తవాలు రాస్తే సదరు మీడియా అంతు చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతికూల వార్తలు రాయనని లిఖిత పూర్వకంగా రాసిస్తేనే శివరాత్రి ఉత్సవాల చిత్రీకరణకు అంగీకరిస్తానంటూ సరికొత్త నిబంధనలను జారీ చేస్తున్నారు ఈఓ భ్రమరాంబ. 
 
ఈఓగారి హెచ్చరికల నేపథ్యంలో నివ్వెరపోతున్నారు మీడియా ప్రతినిధులు. ఎన్నో యేళ్ళుగా జర్నలిజంలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టులు సైతం ఈఓ పోకడపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టంలేని వార్తలు రాస్తే ప్రసారమైన తరువాత బెదిరించిన వారిని చూశాము గానీ అసలు ముందుగానే హెచ్చరించడం.. అది కూడా కోర్టు అఫిడవిట్ తరహాలో తెల్ల పేపర్ మీద సంతకం చేసి మరీ ఇవ్వమన్న అధికారిని ఎప్పుడూ చూడలేదంటున్నారు జర్నలిస్టులు. ఈ విషయంపై జర్నలిస్టు సంఘాలతో కలిసి చర్చించి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. అధికారి నిర్వహణలో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలే గానీ మీడియాకు ముందస్తు హెచ్చరికలు ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే ఈఓ వ్యవహారంపై స్థానిక మీడియా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఆమె తీరులో ఎలాంటి మార్పు కనిపించకపోవడం గమనార్హం.
 
అసలు ఈఓ ఈ విధంగా ప్రవర్తించడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేకసార్లు మీడియాపై చిందులు వేశారు భ్రమరాంబ. ఉత్సవాల ఆలయ పర్వదినాల సమయంలో మీడియాను ఆలయ పరిసరాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న సంధర్భాలు ఉన్నాయి. మొదటి నుంచి ఈఓ భ్రమరాంబ వ్యవహారం వివాదాస్పదంగానే ఉంటోంది. గతంలో పాలకమండలి ఉన్న సమయంలోను అందులోని సభ్యులు తీసుకున్న నిర్ణయాలు డోంట్ కేర్ అన్న రీతిలోను ప్రవర్తించినట్లు విమర్శలున్నాయి. 
 
ఏకంగా పాలకమండలి ఛైర్మన్ గురవయ్యనాయుడుతో విభేదించిన సంధర్భాలు చాలానే ఉన్నాయి. బోర్డు నిర్ణయాలకే దిక్కులేనప్పుడు ఇక క్రిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈఓకు వంతపాడే ఉద్యోగులకు అనుకున్న చోట పోస్టింగులు, ప్రశ్నించిన వారిని ఉన్నచోట నుంచే సాగనంపడం సర్వసాధారణంగా మారిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. క్రింది స్థాయి ఉద్యోగుల సంగతి పక్కనబెడితే భక్తులు, స్థానికులు కూడా పలుసార్లు ఈఓను తప్పుబట్టినా ఫలితం లేదు. ముఖ్యంగా ఆలయంలో పరివార దేవతలకు పూజలు చేయకూడదంటూ నిషేధించడంపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. 
 
పూజారులు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సాకుతో ఏకంగా దేవుళ్ళకే పూజలు నిషేధించడం ఏమిటని అడిగినా ఈఓ పట్టించుకోలేదు. ఆ తరువాత తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రధాన అర్చకుడుగా అర్హత లేని వ్యక్తిని నియమించినా పట్టించుకున్న నాధుడు లేడు. ఈ మధ్యకాలంలో ఆలయం కోసమంటూ ఉన్న ఫలంగా రాహుకేతు పూజల రేట్లు పెంచి భక్తులకు చుక్కలు చూపించారామె. అలాగే ఆలయంలోని ఇతర సేవల రేట్లను ఇష్టానుసారంగా పెంచుకుంటూ వస్తున్నారు. 
 
అదేమని మీడియా ప్రశ్నిస్తే  ఆదాయం పెరగడం ఇష్టంలేని వారే తనపైన ఆరోపణలు చేస్తున్నారంటూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు ఈఓ. రాహుకేతు పూజలకు వినియోగించే వెండి వేలం విషయంలోను ఈఓపై విమర్శలు వచ్చాయి. ఈఓపై భక్తుల్లోను, క్రిందిస్థాయి సిబ్బందిలోను వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆమెకు దేవదాయశాఖ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతోనే ఎవరిని లెక్కచేయలేడంలేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే గతంలో పాలకమండలి సభ్యులు సైతం ఉత్సవవిగ్రహంగా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఇప్పటికైనా ఈఓపై చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.