మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (09:17 IST)

దారి ఇవ్వమని అడిగినందుకు ఉంగరపు వేలిని కొరికేసిన కారు యజమాని...

హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు యజమాని విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. కాస్త దారి ఇవ్వమని అడిగినందుకు ఓ ద్విచక్రవాహనదారుడు ఉంగరపు చేతివేలిని కొరికేశాడు. ఈ ఘటన మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మౌలాలి హనుమాన్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌ జాఫర్‌ అనే వ్యక్తి స్థానికంగా పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఈనెల 24వ తేదీన తన ద్విచక్రవాహనంపై లాలాపేట్‌ వెళుతుండగా మౌలాలి కమాన్‌ వద్ద ఎదురుగా ఇండికా కారు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కారు కొద్దిగా పక్కకు తీస్తే తాను వెళ్లిపోతానని జాఫర్‌ కోరడంతో ఆగ్రహానికిలోనైన కారు డ్రైవర్‌ మహ్మద్‌ ఆలి అతడిని దూషించడమే కాకుండా అతడిపై దాడి చేసి కుడిచేతి ఉంగరం వేలు కొరికాడు. దీంతో అతని చేతి వేలు తెగి కిందపడిపోయింది. 
 
ఆ తర్వాత తెగిపడిన ఉంగరపు వేలితో జాఫర్ ఆస్పత్రికి వెళ్లగా, వారు చికిత్స చేసి అతికించారు. ఆ తర్వాత ఈ ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు మహ్మద్‌ ఆలిని సోమవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్‌ ఆలి మౌలాలి షాదుల్లానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.