శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:33 IST)

శవాల మీద రాబందుల్లా టీడీపీ: బొత్స సత్యనారాయణ

కరోనా విపత్కర సమయంలోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బాధ్యతారాహిత్యంతో రాజకీయం చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  ప్రజల్లో టీడీపీ బ్రతికి ఉందని చెప్పటానికి అవకాశం లేదు కాబట్టే.. తండ్రీకొడుకు కలిసి చెరొక అగ్గిపెట్టె పట్టుకొని ఎక్కడ నిప్పు పెడదామా అని రగిలిపోతున్నారు.

అందులో భాగంగానే తండ్రి ఆక్సిజన్ అందలేదంటూ లేనిపోని ఆరోపణలు చేస్తుంటే... కొడుకు విద్యార్థులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి బొత్స ఘాటుగా విమర్శలు చేశారు. 
 
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలోనూ ప్రతిపక్ష తెలుగుదేశం తమ పార్టీ ఉనికి కోసమే రాజకీయాలు చేస్తుంది తప్ప, వారికి ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. చివరికి ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే.... ఆయన మాటల్లోనే..
 
- దేశంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా స్పందిస్తారు. వచ్చిన ఆపదను అందరూ కలిసి ఎదుర్కొంటారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా వున్న తెలుగుదేశం కరోనా సంక్షోభాన్ని కూడా తన రాజకీయం కోసం వాడుకుంటోంది. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రభుత్వంపైనా, ప్రజలకోసం ప్రాణాలొడ్డి నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగులపైనా ఇష్టారాజ్యంగా చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. 
 
- ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓటమి పాలయ్యింది. దానిని జీర్ణించుకోలేక, అసహనంతో ఈ ప్రభుత్వంపైనా, సీఎం శ్రీ వైయస్ జగన్ గారిపైనా ఏదో ఒక రకంగా బురదచల్లాలనే లక్ష్యంతో తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. ఆక్సీజన్ లేదని, విద్యార్ధులకు పరీక్షలు రద్దు చేయాలంటూ రెచ్చగొట్టే రాజకీయం చేస్తోంది.

మరోవైపు ఉద్యోగుల్లో అపోహలు కలిగించేలా చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ చిత్తశుద్దితో, నిబద్ధతతో తన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. 
 
-  కోవిడ్ పై  రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు యుద్దం చేస్తున్నారు. ప్రతినిత్యం సీఎం వైయస్ జగన్ కరోనా పరిస్థితులను సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను, ఉద్యోగులను ముందుకు నడిపిస్తున్నారు. కరోనా పేషంట్లకు కావాల్సిన బెడ్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, మందులు, ఇంజెక్షన్లు, ఆక్సీజన్ ఇలా ప్రతి అంశంపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 
 
-  104 సెంటర్‌ ను పటిష్టం చేయడం ద్వారా కాల్ చేసిన రెండుమూడు గంటల్లోనే ఎక్కడ ఖాళీ బెడ్లు వున్నాయో పరిశీలించి, పేషంట్లను అక్కడికి పంపుతున్నాము. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జీలుగా పెట్టాం. ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ తదితర శాఖలు అన్ని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా వైద్య అధికారులు నిరంతరం శ్రమిస్తూ, పేషంట్లకు సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి ఆత్మస్థైర్యం కల్పిస్తున్నారు. 
 
-  కరోనా పై జరుగుతన్న ఈ పోరులో ఉద్యోగులు సైనికులుగా ముందుండి పనిచేస్తున్నారు. ఈ సమయంలో వారి ఆత్మస్థైర్యంను దెబ్బతీసేలా చంద్రబాబు, లోకేష్ మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజలను కాపాడే విషయంలో సైనికులుగా పనిచేస్తున్న వారిని వెన్నుతట్టి అభినందించాల్సిన కనీస బాధ్యత ప్రతిపక్షంగా తెలుగుదేశంకు లేదా? ఇదేనా చంద్రబాబు రాజకీయ పరిణితి? ఈ ప్రభుత్వంపైన కడుపుమంటతోనే చంద్రబాబు ఉద్యోగుల్లో అలజడి సృష్టించేందుకు మాట్లాడుతున్నాడు.
 
- విజయనగరం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘటనతో జిల్లా కలెక్టర్ నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల వరకు వెంటనే ఆ ఘటనపై స్పందించారు. ఆక్సీజన్ అవసరమైన పేషెంట్లను తక్షణం ఇతర ఆసుపత్రులకు తరలించడం, ఇరవై మందిని అంబులెన్స్‌లో ఆక్సీజన్ అందించి కాపాడటం చేశారు.

ప్రతిక్షణం అమూల్యమైనదిగా డాక్టర్లు, సిబ్బంది పనిచేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో నిబద్ధత, చిత్తశుద్దితో పనిచేశారు. అటువంటి వారిని కనీసం అభినందించాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీకి లేదా? దానికి బదులు ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ తప్పుడు మాటలు మాట్లాడతారా? 
 
- ఈ రోజు అవసరమైన ఆక్సీజన్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఆక్సీజన్ ఉత్పత్తికి వున్న అన్ని అవకాశాలను సీఎంగారు వినియోగించుకుంటున్నారు. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ పరిశ్రమలను తెరిపించి, ఆక్సీజన్‌ను ఉత్పత్తి చేయిస్తున్నారు. అత్యవసర ఫార్మా తప్ప మిగిలిన వారికి విజ్ఞప్తి చేసి పారిశ్రామిక అవసరాలకు ఆక్సీజన్ వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేశారు.

రెమిడెసివర్ ఇంజక్షన్ల కోసం ఫార్మా కంపెనీలతో సీఎం గారు స్వయంగా మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో షట్ డౌన్‌ లో వున్న రెండు ఆక్సీజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను తిరిగి వినియోగం లోకి తెచ్చేందుకు కేంద్రంతో  సీఎంగారు మాట్లాడుతున్నారు. ఇంత బాద్యతగా సీఎం వైయస్ జగన్ పనిచేస్తున్నారు. 
 
- ఇదంతా చూస్తూ కూడా చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు  చేతులెత్తేశాడు. శవాలమీద రాబందుల్లా  చంద్రబాబు టీడీపీని తయారు చేశాడు. చంద్రబాబు సహేతుకపమైన సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా పరిశీలిస్తాం. కానీ మీరు ఒక్కటైనా పనికివచ్చే సూచన ఇస్తున్నారా? 
 
- ఇంతవరకు మానవజాతి చరిత్రలో మనదేశాన్నే తీసుకుంటే.. ఈరోజు లెక్కల ప్రకారం.. కోటి అరవై తొమ్మి లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇందులో బీజేపీ రాష్ట్రాలని, కాంగ్రెస్ రాష్ట్రాలని,  ఎన్‌డీఏ రాష్ట్రాలని, యుపిఏ రాష్ట్రాలని, కమ్యూనిస్టు రాష్ట్రాలని తేడా ఏమీలేదు. అది ఒక విషపురుగు. అది మనిషిని కాటేస్తోంది. మనిషిని కాటేస్తుంటే... మనుషులంగా మనం అందరం కలిసి దాని మీద పోరాడాలా? లేక పొద్దున్నే లేస్తే చాలు.. నా కులం, నా వర్గం, నా వాళ్లు అంటున్న నీచ రాజకీయాన్ని ఈ సమయంలో కూడా కొనసాగించాలా? 
 
పరీక్షలు రద్దు చేస్తే జాతీయ స్థాయిలో మన విద్యార్థులు ఎలా పోటీ పడగలరు?
- పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ మాట్లాడుతున్నాడు. ఇతర రాష్ట్రాలు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ స్థితిలో మన రాష్ట్రంలో పరీక్షలు రద్దు చేస్తే విద్యార్ధులకు తీరని అన్యాయం జరుగుతుంది. జాతీయస్థాయి సంస్థల్లో మన విద్యార్ధులు ఎలా పోటీ పడగలరు? విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

నిజంగా పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితే వుంటే.... కేంద్రమే అన్ని రాష్ట్రాల్లోనూ పరీక్షలు రద్దు చేయాలని ప్రకటించేది కాదా? విద్యార్ధుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వం ఎంతో బాధ్యతగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిజంగా తెలుగుదేశంకు చిత్తశుద్ది వుంటే పరీక్షల రద్దుపై కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు?
 
- స్వయంగా ప్రధాని మాట్లాడుతూ లాక్‌డౌన్ ఆఖరి అస్త్రంగా వుండాలని అన్నారు. దానిపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు కామెంట్ చేయలేదు? గత ఏడాది లాక్‌డౌన్‌ వల్ల దేశంలో ఏర్పడిన ఇబ్బందులు, అనుభవాల దృష్ట్యా దానిని ఆఖరి అస్త్రంగానే చూడాలని ప్రధాని చెప్పారు. దానికి అనుగుణంగానే రాష్ట్రాలు ఆలోచనలు చేస్తున్నాయి. అలాగే మన రాష్ట్రంలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 
 
- ఈ రోజు కేవలం పదోతరగతి పాస్‌ సర్టిఫికెట్‌తో విద్యార్థి బయటపడితే, ఇంటర్ సర్టిఫికెట్‌తో మార్కులు లేకుండా పాస్‌ అని ఒక విద్యార్థి బయటకు వస్తే.. ఇదే విద్యార్థి మరో యాభై ఏళ్ల భవిష్యత్‌ ఈ సర్టిఫికెట్ల మీదే.. ఆధారపడుతుంది. పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల్లో మార్కులు, పర్సంటేజీలు, ర్యాంకులు ఉంటే.. నిర్వహించని రాష్ట్రాల విద్యార్థులకు కేవలం పాస్ అని సర్టిఫికెట్ ఉంటుంది.

ఏ మనసున్న ప్రభుత్వం అయినా, పిల్లలు, తల్లిదండ్రులు గురించి ఆలోచించే ఏ ప్రభుత్వం అయినా ఏం కోరుకుంటుంది. పాస్ సర్టిఫికెట్ ఇవ్వాలని అనుకుంటుందా? జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించి వారి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని అనుకుంటుందా? ఇటువంటి సమయంలో పరీక్షలు నిర్వహించటం ఏ ప్రభుత్వానికి అయినా కష్టతరమైనా కూడా పిల్లల భవిష్యత్‌ గురించి దాని బాధ్యతగా భావించడం మూర్ఖత్వం అవుతుందా?

ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా మారాలని లోకేశ్ తెగ కష్టపడుతున్నాడు. సమాజాన్ని కలిపి ఉంచటానికి జగన్ నాయకత్వం పనిచేస్తుంటే... సమాజాన్ని ముక్కలు చేయటానికి చంద్రబాబు, ఆయన కొడుకు, వారి పత్రికలు, వారి టీవీలు .. వీళ్లంతా తయారయ్యారు.
 
- కరోనా మరణాలను ప్రభుత్వ హత్యలు అంటున్న చంద్రబాబు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న కరోనా మరణాలను కూడా అలాగే అంటారా? తన ప్రచారం కోసం రాజమండ్రి పుష్కరాల్లో అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడాన్ని ప్రభుత్వ హత్యలు అని అంటారు. అలా చేసింది చంద్రబాబే. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే, బాధ్యత లేకుండా ప్రభుత్వ హత్యలు అని ఇష్టారాజ్యంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 
 
- ఈ రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ మార్గదర్శకంలో స్పష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం పనిచేస్తోంది. హోం ఐసోలేషన్, కరోనా కేర్ సెంటర్లు, హాస్పటలైజేషన్ ద్వారా మూడంచెల విధానంతో ప్రజలకు సేవలు అందిస్తున్నాం. అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది నియమాకాలను చేపట్టాం. కోవిడ్ కేర్ సెంటర్‌లలో ఉచితంగా మందులు, ఆహారం,ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం. ఆక్సీజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
 
-  పత్రికల వాళ్లను కూడా అడుగుతున్నాను. ఒక తుఫాను వచ్చినప్పుడు ఒక భూకంపం వచ్చినప్పుడు, ఒక మహావిపత్తు మన మీద దండెత్తినప్పుడు మీ పత్రికల పేర్లతో, మీ టీవీల పేర్లతో సహాయ నిధి అంటూ... రాసేవారే. మరి ఈరోజున మొత్తంగా దేశానికి, రాష్ట్రానికి విపత్తు వస్తే... జరుగుతున్న మంచిని చూపించేది పోయి.. లేనిపోని అపార్థాల్ని, అపోహల్ని పెంచుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి..? 
 
- అందరం కలిసి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా ఉండాలో, మీ పాత్ర మీరు పోషిస్తున్నారా అన్నది ప్రతిపక్షాల్ని, చంద్రబాబు అనుకూల మీడియాను నేను ప్రశ్నిస్తున్నాను. మీ మొహాలను మీ అద్దాల్లో చూసుకోండి. మీకు ఆత్మ అంటూ ఉంటే.. ఆత్మ పరిశీలన చేసుకోండి. సిగ్గు అంటూ ఉంటే.. ఇంతవరకు మీరు చేసిన ఈ ప్రచారాలకు సిగ్గుపడండి.