1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 25 నవంబరు 2021 (18:03 IST)

చొక్కా విప్పి పనిచేసిన ఎమ్మెల్యే, హమాలీగా మారి వరద బాధితుల కోసం...

chevireddy
చిత్తూరు జిల్లా రాయలచెరువు సమీపంలో వరద ముంపు ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హమాలీ అవతారమెత్తారు. చొక్కా విప్పి నిత్యావసర వస్తువులను మూటలను ఎత్తడం, దించుతూ శ్రామికుడిగా మారాడు.

 
రేణిగుంట పాత విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని వరద ముంపు ప్రాంతాలైన 11 గ్రామాలకు నేవీ హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులను సరఫరా చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహచరులతో కలిసి నిత్యావసర సరుకులను సరఫరా చేశారు.

 
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహచరులతో కలిసి నిత్యావసర సరుకులను నిరాశ్రయులకు అందజేశారు. గ్రామాలలో పరిస్థితిని పరిశీలించి ఎమ్మెల్యే చలించిపోయారు. గ్రామాలలో వరద నీటిని ఖాళీ చేసేందుకు ఉన్న అవకాశాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

 
రాయలచెరువుకు గండి పడిందన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి గత మూడు రోజులుగా కట్టపైనే ఉంటున్నారు. కట్ట బలోపేతానికి చేపడుతున్న పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజలను సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు.

 
వరద పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించరాదని, చెరువు ప్రమాదం జరిగినా ఏ ఒక్కరికి ప్రాణహాని జరగకూడదని సిఎం జగన్ ఇచ్చిన ఆదేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సిఎం ఆదేశాలను బాధ్యతగా స్వీకరించి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల నుంచి 7వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలియజేశారు. 

 
దాదాపు 5 వేల హెక్టార్లలో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశామన్నారు. ఏ వ్యక్తి ఆకలితో ఉండకూడదని..ఏ ప్రాణం పోకూడదన్న సిద్థాంతంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. సిఎంను ఒప్పించి నేవీ హెలికాప్టర్‌ను ప్రత్యేకంగా తెప్పించారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.