బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (19:23 IST)

వైసీపీ ఇసుక పాలసీతో మరిన్ని సమస్యలు.. టీడీపీ

ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా, మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతున్నాయని, ఇసుక పాలసీనే అందుకు ఉదాహరణ అని టీడీపీ శాసనసభ్యులు మంతెన రామరాజు స్పష్టంచేశారు.

శనివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుకపాలసీ తీసుకొచ్చి 46రోజులైనా ప్రజలకు ఇంతవ రకు ఇసుక అందుబాటులోకి రాలేదన్నారు. ప్రభుత్వ పాలసీ వల్ల ప్రజలకు మేలు జరక్కపోగా,  బ్లాక్‌మార్కెట్‌లో 5యూనిట్ల ఇసుక రూ.30 నుంచి రూ.40 వేలవరకు అమ్ముతున్నారని  రామరాజు తెలిపారు.

గతప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలవల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే, కొత్తగా వచ్చిన ప్రభుత్వంవాటిని రద్దుచేస్తుందని, కానీ ఇసుక విషయంలో టీడీపీప్రభుత్వ పాలసీని రద్దుచేయడం ద్వారా రాష్ట్రప్రభుత్వం సరిదిద్దుకోలేని తప్పుచేసిందని టీడీపీనేత పేర్కొన్నారు.

కొత్తపాలసీ భవననిర్మాణకార్మికుల జీవితాలను చిత్తుచేసిందని, ఆన్‌లైన్‌లో ఏ ఇబ్బందిలేకుండా ఇసుక బుకింగ్‌సౌలభ్యం కల్పించినట్లు ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తివిరుద్ధంగా ఉందన్నారు. ఏపీఎండీసీ ఎండీ స్వయంగా ఆన్‌లైన్‌లో బుక్‌చేసినా ఇసుకవచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే ఎద్దేవాచేశారు.

టీడీపీ హయాంలో 5 యూనిట్ల ఇసుక రూ.5వేలకు లభిస్తే, ఇప్పుడు అంతేమొత్తాన్ని రూ.40వేలకు బ్లాక్‌మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని మంతెన వాపోయారు. ప్రభుత్వనిర్ణయం వల్ల  30లక్షలకు పైగా భవననిర్మాణకార్మికులు, అనుబంధరంగాల పనివారు ఉపాధిలేక రోడ్డున పడే పరిస్థితిని జగన్‌ ప్రభుత్వం కల్పించిందన్నారు.

ఇసుకదొరక్క నిర్మాణాలు నిలిచిపోవడం తో, నిర్మాణరంగానికి అనుబంధంగా ఉండే సిమెంట్‌, ఇనుము, ఎలక్ట్రికల్‌వస్తువులు, కలప, నాపరాయి, గ్రానైట్‌ వంటి పరిశ్రమలు కూడా కుదేలయ్యాయని, ఆయావ్యాపారాలు నిర్వహించేవారు పన్నులు కూడా కట్టలేని దారుణపరిస్థితి రావడంతో ప్రభుత్వానికి ఆదాయంకూడా భారీగా  తగ్గిందని టీడీపీఎమ్మెల్యే వివరించారు.

ఇసుకకొరత కారణంగా బ్లాక్‌మార్కెట్‌లో సముద్రఇసుకను విక్రయిస్తున్నారని, దాన్ని అధికధరకు కొనుగోలుచేసి నిర్మాణాలు చేయడంవల్ల, నిర్మాణాల్లో నాణ్యతకొరవడుతోందన్నారు. ఉప్పు సాంద్రత అధికంగా ఉండే ఇసుకను వాడితే, నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సమస్యలను ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ గుర్తించి, భవన నిర్మాణ కార్మికుల వెతలను అర్థంచేసుకున్నాక, వారిపక్షాన ప్రభుత్వంపై పోరాడటానికి నిశ్చయించిందన్నారు. అందులో భాగంగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల వద్ద సామూహిక నిరాహారదీక్షలకు పిలుపినివ్వడం జరిగిందన్నారు.

ఇసుక  బాధితులందరూ పాల్గొనేలా, ఇసుక విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రామరాజు స్పష్టంచేశారు.

దీనిపై  ప్రతిపక్షపార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగిందని, టీడీపీ నేతలు వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, వాసుపల్లి గణేశ్‌, బచ్చుల అర్జునుడు, నారాయణ రెడ్డిలు ఆ కమిటీలో ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి 140 రోజులైనా ప్రజల గురించి ఆలోచించే ప‌రిస్థితి లేదనడానికి ఇసుక విధానమే నిదర్శనమన్నారు.