రఘురామను అనర్హుడుగా ప్రకటించండి... ఓం బిర్లాకు వైకాపా ఫిర్యాదు
ఢిల్లీ కూర్చొని తమ ప్రభుత్వ పరువు తీస్తున్న సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైకాపా తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, తనపై ఏపీ సీఐడీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించడంతో రఘురాజు మరింతగా రెచ్చిపోతున్నారు. పార్లమెంట్ సభ్యులందరితో పాటు.. అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఆయన లేఖలు రాశారు. ఏపీలో పోలీస్ రాజ్యం, నియంత పాలన సాగుతుందోంటూ ఆ లేఖల్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు కూడా ఫిర్యాదు చేశారు.
దీంతో తన పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ గుర్రుగా వుంది. పైపెచ్చు.. ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైసీపీ ఎంపీ, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ శుక్రవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామకృష్ణరాజు అంశాన్ని చర్చించారు.
రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనపై అనర్హత వేటు వేయాలని భరత్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ అనుసరించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని ఆరోపించారు.
ఈ సందర్భంగా రఘురామ వైసీపీ గుర్తుపై నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. రఘురామ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను తాము గతంలోనే లోక్‌సభలో అందించామని భరత్ స్పీకర్ వివరించారు.