1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 9 జులై 2021 (19:11 IST)

జ‌ల వివాదంపై కేంద్ర మంత్రిని క‌లిసిన ఎంపీ విజయసాయి

కృష్టా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి కృష్టా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని స్పష్టంగా నిర్దేశించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్ర జల్‌ శక్తి మంత్రి  గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే అన్ని ప్రాజెక్ట్‌లకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రతను కల్పించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి శుక్రవారం మంత్రి షెకావత్‌ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను ఆయన మంత్రికి వివరించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ఆవశ్యకత గురించి మంత్రితో కూలంకుషంగా చర్చించి దీని నిర్మాణాన్ని అనుమతించవలసిందిగా మంత్రిని కోరారు. ఈ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు శ్రీ విజయసాయి రెడ్డి చెప్పారు.
 
తెలంగాణ ప్రభుత్వం కృష్టా జలాల ఆధారంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల విస్తరణ, శ్రీశైలం ఎడమ కాలువ విస్తరణ వంటివి ఏ విధంగా చట్ట విరుద్ధమైనవో మంత్రికి వివరించినట్లు ఎంపీ విజ‌య‌సాయి చెప్పారు.