విజయసాయి గారూ! ముఖానికి బ్లీచింగ్ పౌడర్ రాసుకున్నారా?: బుద్దా ఎద్దేవా
"ఎంపీ విజయసాయిరెడ్డి గారూ! సీఎం జగన్ చెప్పారని ముఖానికి బ్లీచింగ్ పౌడర్ రాసుకున్నారా? పారాసిట్‌మాల్ వికటించిందా?" అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
విజయసాయి పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కొంపతీసి సీఎం జగన్ చెప్పారని ముఖానికి బ్లీచింగ్ పౌడర్ రాసుకున్నారా అని నిలదీశారు. తేడాగా మాట్లాడుతున్నారని, కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడంలో పేటెంట్ రైట్స్ జగన్‌కి ఉన్నాయని మర్చిపోయారా అని నిలదీశారు.
మీ క్రిమినల్ గేమ్స్‌కి ఎండ్ కార్డు పడే రోజులు దగ్గర పడ్డాయని బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఆదివారం జరగబోయే జనతా కర్ఫ్యూ లో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. అన్ని రాష్ట్రాలకు కరోనా మహమ్మారి ముప్పు ఒకేలా ఉందని, దీన్ని ఎదురుకోవాలంటే ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
రాబోయే మూడు నాలుగు వారాలు అత్యంత కీలకమని, వైరస్ నిరోధానికి అందరూ శక్తివంచన లేకుండా కృషి చెయ్యాలని కోరారు. కరోనా వ్యాధికి మెడిసిన్ లేదు కాబట్టి సామాజిక దూరం పాటించడమే వైరస్ వ్యాప్తి నిరోధానికి అత్యంత ముఖ్యమని, అందుకే రేపు 22వ తారీకు ప్రజలందరూ స్వచ్చంధంగా జనతా కర్ఫ్యూను పాటించాలని కోరారు.
ఆదివారం ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు ప్రజలెవ్వరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు, అదే విధంగా ప్రధాని పిలుపు మేరకు సాయంత్రం 5గంటలకు ఇళ్ల బాల్కనీ వద్దకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విశేషంగా సేవలందిస్తున్న వారికి మద్దతుగా 5నిమిషాలపాటు చప్పట్లు కొడుతూ వారికి మద్దతు తెలపాలని కోరారు.
జనతా కర్ఫ్యూకు అందరూ సమాయత్తంగా ఉండాలని, ప్రయాణాలు, రోజువారీ పనులు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి నివారణకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఆయన తెలిపారు.