ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (14:45 IST)

ముంబై నటి జైత్వానీపై అక్రమ కేసు : రిమాండ్ రిపోర్టులో ఐపీఎస్‌ల పేర్లు

jaitwani kadambari
ముంబై నటి కాదంబరి జైత్వానీ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే, ఈ సందర్భంగా పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పొందుపరిచారు. ఈ కేసులో ఏ1గా వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ఉండగా, ఏ3, ఏ4, ఏ5గా ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిల పేర్లను చేర్చారు. ఏ2గా అప్పట్లో ముంబై నటి జైత్వానీ కేసును విచారించిన విచారణాధికారి సత్యనారాయణ పేరును చేర్చారు. 
 
మరోవైపు, కుక్కల విద్యాసాగర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విద్యాసాగర్‌ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాంతి రాణా టాటా ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం వరకు కాంతి రాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు రేపు తీర్పును వెలువరించనుంది.