మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (10:45 IST)

తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ ఓ చెత్త ఐటీ పార్కులా వుంది : దర్శకుడు నాగ్ అశ్విన్

Nag Ashwin
తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర రైల్వే శాఖ కంకణం కట్టుకుంది. దీంతో ఆ శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తిరుపతి రైల్వే స్టేషన్‌కు సంబంధించి వరల్డ్ క్లాస్ డిజైన్లను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వీటిపై తిరుపతి పట్టణ ప్రాంత వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ భవనం డిజైన్ సాదాసీదాగా ఉందని, ఒక ఐటీ కార్యాలయంలా ఉందని, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి రైల్వే స్టేషన్‌ డిజైన్లలో ఆధ్యాత్మికతకు తగ్గట్టుగా లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి ఆధ్యాత్మికత ఈ డిజైన్లలో కనిపించడం లేదని అంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్ చేశారు. "డియర్ సర్... తిరుపతి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ డిజైన్లను ఎవరూ ఇష్టడటం లేదు. ప్రజల నుంచి వస్తున్న కామెంట్లను మీరు కూడా చూసే ఉంటారు. వెస్టర్న్ డిజైన్‌ను కాపీ చేసినట్టుగా, ఒక చెత్త ఐటీ పార్కు తరహాలో ఉంది. తిరుపతి చాలా ప్రత్యేకమైనది. 
 
ఆధ్యాత్మికతతో కూడుకున్నది. అత్యుత్తమమైనటువంటి మన భారతీయ ఆర్కిటెక్చర్‌పై పట్టున్న వ్యక్తుల చేతిలో డిజైన్ చేయించండి. గ్లాస్, స్టీల్‌తో కూడిన భవలనాను కాపీకొట్టొద్దు" అని రైల్వే మంత్రికి సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అనేక మంది నాగ్ అశ్విన్‌కు మద్దతు పలుకుతూ రీట్వీట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈయన ప్రభాస్ హీరోగా "ప్రాజెక్టు-కె" పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.