టీడీపీ కృషి పలితమే దేశపటంలో అమరావతికి చోటు : నక్కా ఆనందబాబు
రాజధానిపై వైసీపీ ప్రభుత్వం సృష్టించిన గందరగోళం వల్లే గతంలో విడుదల చేసిన దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని లేదని, టీడీపీ ఎంపీల కృషి ఫలితంగా అమరావతికి దేశ పటంలో కేంద్రం స్థానం కల్పించిందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.
గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ చిత్రపటంలో కేంద్రం అమరావతిని గుర్తించడం సంతోషకరమన్నారు. అందుకు కృషిచేసిన టీడీపీ ఎంపీలకు అభినందనలు తెలిపారు. అమరావతి 13 జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించేందుకు చంద్రబాబు సంకల్పించారన్నారు. కానీ రాజధాని నిర్మిస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో వైసీపీ రాజధాని నిర్మాణాన్ని నిలిపేసిందన్నారు. ప్రభుత్వాలు మారినప్పడల్లా రాజధానులను మార్చడం దౌర్బగ్యమన్నారు. రైతుల త్యాగాలను గుర్తించి అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు.
రాజధానిలో ఇప్పటికే 5 వేల గృహాలను నిర్మించామని, 600 కి.మీ రహదారులు నిర్మించామన్నారు. 40 వేల కోట్ల పనులకు టెండర్లు పిలవటం జరిగిందన్నారు. 22 మంది వైసీపీ ఎంపీల వల్ల రాష్టానికి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలున్నప్పటికీ వైసీపీ ఏనాడూ రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో మాట్లాడింది లేదు. ప్రత్యేక హోదా అంశంపై ఎందుకు పార్లమెంట్‌లో నోరు ఎత్తడం లేదన్నారు.
జగన్ కేసులపై లాబీయింగ్ కోసమే వైసీపీ ఎంపీలు పని చేస్తున్నారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రజలు ఎంపిక చేసుకున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకుని రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ని విమర్శించారని లోకేష్‌ను డీఆర్సీ సమావేశానికి రాకుండా తీర్మానం చేయటం విడ్డూరంగా ఉందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన అరుదు అన్నారు.
శాసనమండలి సభ్యులైన లోకేష్‌ని డీఆర్సీ సమావేశానికి రాకుండా తీర్మానించే హక్కు వైసీపీకి ఎవరిచ్చారన్నారు. ఇది వైసీపీ అవగాహనరాహిత్యమని దీన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది న్యాయపరంగా నిలవని అంశం అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించివారిపై కేసులు పెట్టడం, బెదిరించటం వంటి చర్యలు వైసీపీ మానుకోవాలని హితవు పలికారు.