శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (08:53 IST)

టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడి మృతి.. షాక్‌కు గురైన హరికృష్ణ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అర్థరాత్రి హఠాన్మరణం చెందారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అర్థరాత్రి హఠాన్మరణం చెందారు. ఆయన మృతి వార్త తెలియగానే సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి చేరుకుని గాలి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణ వార్త విన్న వెంటనే ఒకింత షాక్‌కు గురయ్యానని, ఆయన మృతి వ్యక్తిగతంగా తననెంతో బాధించిందన్నారు. 1983లో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన గాలి... అప్పటి నుంచి ఆయన ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెంటే ఉన్నారని హరికృష్ణ గుర్తుచేశారు. 
 
తమ కుటుంబంతో ముద్దుకృష్ణమ ఎంతో సన్నిహితంగా ఉండేవారని హరికృష్ణ చెప్పారు. ఎన్నో పదవులు చేపట్టిన ముద్దుకృష్ణమ వాటికి వన్నె తెచ్చారని అన్నారు. ఆయన మృతి ప్రజలకు తీరని లోటని హరికృష్ణ పేర్కొన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. 
 
అలాగే, హఠాన్మరణం చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు భౌతికకాయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు నేతలు నివాళులు అర్పించారు. వీరిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు తదితరులు కేర్ ఆసుపత్రికి వెళ్లి ముద్దుకృష్ణమ భౌతికకాయానికి నివాళులర్పించారు. అలాగే అక్కడే ఉన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.