జగన్ రెడ్డి కట్టించే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావట!
పేదలకు ఇళ్ళ స్థలాల విషయంలో వైసీపీ నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి, టీడీపీపై బురద జల్లుతున్నారని నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబునాయుడు తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహ నిర్మాణం కోసం కేంద్రం రూ.3,700 కోట్లు విడుదల చేసిందని, దీనిలో రూ.2 వేల కోట్లను దారి మళ్లించారన్నారు. దారిమళ్లించిన నిధులు లబ్ధిదారులకు ఎగనామం పెట్టేందుకు వైసీపీనే కోర్టులో కేసులు వేయించి, దాన్ని ప్రతిపక్షాలకు అంటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జగన్ రెడ్డి కట్టే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావని వైసీపీ శాసనసభ్యులే చెప్పారని ఎద్దేవా చేశారు.
సెంటు పట్టాలో రూ.6,500 కోట్ల అవినీతి చేశారు. రెండు సెంట్లు నగరాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలి. రాష్ట్ర నిధుల నుంచి మరో రూ.2 లక్షలు గృహనిర్మాణానికి విడుదల చేయాలని బాబు డిమాండు చేశారు. రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని, దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారని చెప్పారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, సోలార్, విండ్ పవర్ తీసుకువచ్చామని చెప్పారు.
జగన్ రెడ్డి అంతా నాశనం చేశారు. బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే, బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారు. తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గంగిరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. ఆషి ట్రేడింగ్ కంపెనీతో వేలకోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాకు శ్రీకారం చుట్టారు. ఆశి అనే పేరు ఆలీషా కుమార్తె నిక్ నేమ్ కాదా? ఆలీషా పెద్ద మనిషి అని చంద్రశేఖర్ రెడ్డి కితాబు ఎందుకు ఇచ్చారు? వారి అక్రమ వ్యాపారానికి ఇది నిదర్శనం కాదా? హవాలా, మనీలాండరింగ్ ద్వారా పెద్దఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు. గంజాయి, హెరాయన్, ఎర్రచందనం, తలనీలాలకు, స్మగ్లర్లకు పెద్దపీట వేయడమే జగన్ రెడ్డి విధానంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్స్ ఏపీలోనే ఎందుకు ఉన్నాయి? అని చంద్రబాబు ప్రశ్నించారు.