ఉద్రిక్తత నడుమ రమ్య పోస్ట్ మార్టమ్...నారా లోకేష్ అరెస్ట్
గుంటూరులో హత్య జరిగిన రమ్య మృతదేహాన్ని సందర్శించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు.
రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు గుంటూరు చేరుకున్న నారా లోకేష్, నారా లోకేష్ వెంట నక్క ఆనంద్ బాబు, ఎమ్మెస్ రాజు, మద్దిరాల మేని, పిల్లి మాణిక్యరావు తదితర దళిత నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందు. నారా లోకేష్ రాక ముందే, రమ్య మృత దేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, అంబులెన్స్ ముందు తెలుగుదేశం నాయకులు బైఠాయించారు.
దీనితో పోలీసులు బలవంతంగా టీడీపీ నేతల్ని అరెస్టు చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేసి, ప్రత్యేక పోలీస్ వాహనంలో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. స్టేషన్లో సిఐ ఛాంబర్లో ఆయన్ని కుర్చోబెట్టారు. దీనితో తనను ఎందుకు అరెస్ట్ చేశారని నారా లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.