బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (14:04 IST)

ప్రజలు సరైన పక్షానే నిలబడివుంటారు : నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సరైన పక్షానే నిలబడివుంటారని తాను భావిస్తున్నట్టు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఏపీలో జరిగిన పోలింగ్‌పై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఏపీ ప్రజలు చాలా తెలివైన వారని, వారు సరైన అభ్యర్థుల పక్షానే నిలిచారని అన్నారు. 
 
'తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్క పౌరుడికీ నా హృదయపూర్వక కృతజ్ఞతులు. ఈ ఎన్నికలు మంచికి, చెడుకు మధ్య జరిగాయి. ప్రజలు సరైన పక్షానే నిలబడివుంటారని కచ్చితంగా గెప్పగలను' అన్నారు. 
 
'మహిళలకు, వయోవృద్ధులకు కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు రావడం లేదు. ఎండను ఎదిరించి, ఈవీఎంలు మొరాయించినా వెనుదిరగకుండా క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి చూసి వారు ఓట్లేశారు. వారంతా తమ నేత చంద్రబాబు వెనుక ఉన్నారు. తన సొంత కుటుంబాలపై చూపే ఆప్యాయతనే వారు చంద్రబాబుపై చూపారు. హ్యాట్సాఫ్' అని అన్నారు
 
అంతేకాకుండా, తాము ఓడిపోతామన్న నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లో ఈసీ సాయంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు. 'ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి దాడులకు పాల్పడుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడి చేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను నరికేశారు. తాడేపల్లి క్రిష్టియన్ పేటలో నాపై దాడికి దిగారు. ఇందుకేనా? నువ్వు రావాలి, నువ్వు కావాలి అంటున్నారు మీ రౌడీలు, గూండాలు' అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.