శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 28 మే 2019 (21:53 IST)

నా పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోంది... నారా లోకేష్

తనపై సాక్షి పత్రికలో అసత్య వార్తలను ప్రచురుస్తున్నారంటూ ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మీడియాకు విడుదల చేసిన లేఖలో ఆయన... అయ్యా.. తమరు ఎడిటోరియల్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న సాక్షి చానల్లో బ్రేకింగ్ న్యూస్ రూపంలో నాపై అసత్య వార్తలను ప్రసారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

తేదీ మే 28న సాక్షి చానల్లో బ్రేకింగ్ న్యూస్ పేరుతో పార్టీ ఓటమికి కార్యకర్తలు, నేతలే బాధ్యులు. గల్లా వంటి నేతలు గెలవగా మిగిలినవారు ఎందుకు ఓడిపోయారు? చంద్రబాబును మోసం చేసింది నేతలే. ఈవీఎంలు 10 శాతం మోసం చేస్తే, కార్యకర్తలు 90 శాతం మోసం చేసారు అని నేను వ్యాఖ్యానించినట్లు ప్రసారం చేశారు. 
 
వాస్తవంగా నేను మంగళగిరి టీడీపి కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ వ్యాఖ్యలు గుంటూరు పార్టీ కార్యాలయంలో తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబుగారు పాల్గొన్న ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో నేను చేసినట్లు ప్రసారం చేయడం చాలా విచారకరం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాను అడ్డుపెట్టుకుని నన్ను అప్రతిష్టపాలు చేసేందుకు, తెదేపాలో అంతర్గత కలహాలు సృష్టించేందుకు మీరు ఇటువంటి అవాస్తవ ప్రసారాలు చేస్తున్నారని అనుమానించాల్సి వస్తోంది. 
 
కల్పిత వార్తలతో నా పరువుప్రతిష్టలకు భంగం కలిగించిన ఈ ప్రసారాల పట్ల నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తప్పుడు ప్రసారాలు చేసిన ఛానల్ నుంచి.. మీ ఆధ్వర్యంలో ఖండన వేయకోరుతున్నాను. లేనియెడల నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన అంశంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాను... ఇట్లు నారా లోకేష్-తెదేపా జాతీయ కార్యదర్శి.