అప్పులు చేయడంలో పీహెచ్‌డీ చేసిన వైఎస్ జగన్... జర జాగ్రత్తంటూ ప్రజలకు వినతి
అప్పులు చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీలన్నీ లాభాలతో కళకళలాడుతుంటే రాష్ట్ర ఖజానా మాత్రం దివాళా తీసిందని ఆయన ఆరోపించారు.
ఇదే విషయంపై నారా లోకేశ్, మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే... అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని ఆరోపించారు.
ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి... అప్పులు తేవడంలో మాత్రం పిహెచ్ డి చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్... తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారని మండిపడ్డారు.
ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి రూ.33వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది రూ.5 కోట్ల మంది జనం మాత్రమే. ఇప్పటికే నేను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే రెండు నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.