బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (14:01 IST)

గుర్తుపెట్టుకోండి.. ఏ ఒక్కడినీ వదిలిపెట్టను : నారా లోకేశ్ వార్నింగ్

అధికార వైకాపా నేతలకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి.. ఏ ఒక్కరినీ వదలిపెట్టబోనని హెచ్చరించారు. మాజీ మంత్రి వైఎస్ వివేనంద రెడ్డి హత్య తర్వాత తమ పార్టీ అధినేత చంద్రబాబుపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారన్నారు. 
 
సాక్షి దినపత్రికపై నారా లోకేష్ రూ.75 కోట్ల పరువు నష్ట దావా వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన గురువారం విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవురు నష్టం దావాకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కోర్టుకు వచ్చాను. నేను దావా వేసినప్పటికీ వాళ్లు కావాలనే ఆలస్యం చేస్తున్నారు. కానీ, న్యాయమూర్తి ఎట్టిపరిస్థితుల్లోనూ 28వ తేదీ నాటికి కౌంటర్ వేయాలని వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. 
 
ముఖ్యంగా, నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచే సాక్షి మీడియా తనపై దాడి చేస్తుందన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి నాపై బురద జల్లింది. 2019లో అక్టోబరులో "చినబాబు చిరుతిండి 25 లక్షలండి" అనే శీర్షికతో సాక్షిలో ఒక కథనాన్ని ప్రచురించింది. దాన్ని చూసి మరో ఆంగ్లపత్రిక, మరో నేషనల్ మ్యాగజైన్ ఈ కథనాన్ని ప్రచురించింది. 
 
వీళ్ళ ముగ్గురికి నేను నోటీసులు జారీచేశాను. ఆ తర్వాత మ్యాగజైన్ క్షమాపణలు కోరింది. కానీ, సాక్షిగానీ, మరో పత్రికగానీ ఎక్కడా వివరణ ఇవ్వలేదు. నేను ఈ విషయంపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్లు దాన్ని ప్రచురించలేదు. అందుకే నేను సాక్షిపై పరువు నష్టం దావా వేసినట్టు చెప్పారు. అంతేకాకుండా, తమను, తమ పార్టీ కార్యర్తలు, నేతలను టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు.