శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (20:17 IST)

వడ్డీ.. చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం : వైకాపాకు నారా లోకేశ్ హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార వైకాపా నేతలు చేస్తున్న దాడులపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. 
 
వాహనాల కొనుగోలు కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జేసీ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 
 
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. జగన్‌ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు.
 
జేసీ కుటుంబానికి ట్రావెల్స్‌ వ్యాపారం కొత్తకాదని తెలిపారు. 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్‌.. ఏపీ ప్రజలందరితో చిప్పకూడు తినిపించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. తొందర్లోనే తిరగబడే రోజు వస్తుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభాకర్‌ రెడ్డిపై ఫిబ్రవరి నుంచి 22 కేసులు పెడుతూ వచ్చారన్నారు. జేసీ ప్రభాకర్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.