మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (17:57 IST)

కోర్టు అనుమతితోనే విశాఖకు రాజధానిని తరలిస్తాం : మంత్రి బొత్స

మూడు రాజధానుల అంశంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అయితే కోర్టు అనుమతితోనే రాజధానిని విశాఖపట్టణానికి తరలిస్తామని ఏపీ మంత్రి  బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం పేదల ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైఎస్‌ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లేఅవుట్లు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. విద్యుదీకరణకు అవసరమైన నాణ్యమైన సామగ్రి ఏర్పాటు చేయాలని కోరారు. అక్టోబర్‌ 25 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. 
 
ఈ సమీక్ష తర్వాత రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు వాటర్‌ ప్లస్‌ సిటీలుగా ధ్రువీకరణ లభించిందని, ఇదే స్ఫూర్తితో మిగిలిన కార్పొరేషన్లలోనూ ప్రగతి సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
 
'రాజధాని అమరావతి కేసులో రోజువారీ విచారణ జరుగుతుందని హైకోర్టే చెప్పింది. విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు ఎందుకు అడిగారో తెలియడం లేదు. రాజధానిపై కేసు వేసిన పిటిషనర్లకు వాయిదా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది. వాయిదా వేయాలని అడగటంలో ఏమైనా దురుద్దేశం ఉందా... అనేది అర్థం కావడంలేదు. ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదు. న్యాయస్థానాన్ని ఒప్పిస్తాం. న్యాయస్థానం ఆదేశాలతోనే విశాఖ వెళ్తాం' అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.