ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం - ఏపీకి పొంచివున్న తుఫానుల గండం
దేశంలో ఈశాన్య రుతుపవనాలు బుధవారం నుంచి ప్రవేశించాయి. ఆ తర్వాత ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. వీటి ప్రభావం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌కు ఈశాన్యం ప్రవేశించడం గమనార్హం.
ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 'లానినొ' పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
అక్టోబరు నుంచి డిసెంబరు నెల వరకు ఈ రుతుపవనాల ప్రభావం ఉంటుంది. దీనికి తోడు, అక్టోబరు 22 లేదా 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది ఈశాన్య రుతుపవనాలను మరింత చురుగ్గా మార్చవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అక్టోబరు, నవంబరు నెలల్లో బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడటానికి అనువైన వాతావరణం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం బలపడితే తుపానుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగా రాబోయే రుతుపవనాలతో వర్షాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.