ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జులై 2024 (09:59 IST)

ఎన్టీఆర్ జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి?

blast
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, 16 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. జగ్గయ్యపేట సమీపంలోని బోడవాడలోని అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటన చోటుచేసుకుంది.
 
బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన 17 మంది కార్మికులు పేలుడులో గాయపడి విజయవాడలోని రెండు ఆసుపత్రుల్లో చేరారు. గాయపడిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
 
జిల్లా కలెక్టర్ జి.సృజన క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. సంబంధిత కంపెనీ అధికారుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు దారితీసిందని కొందరు కార్మికులు ఆరోపించారు. 
 
కాగా, ఘటనపై ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు ఆరా తీసి, బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 
 
ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని, పేలుడుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్థానిక అధికారులను ఆదేశించారు. నష్టపోయిన వారికి కంపెనీ నుంచి సరైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎక్స్ గ్రేషియా చెల్లిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.