1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:34 IST)

రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు... ఎంత హంగామానో!

ఈ తెల్లవారు జామున మచిలీపట్నం సబ్ జైలు నుండి బందోబస్తు మధ్య రాజమండ్రికి టీడీపీ అధికార ప్ర‌తినిధి పట్టాభిని త‌ర‌లించారు. మ‌చిలీప‌ట్నం స‌బ్ జైలుకు తెచ్చేట‌పుడు పోలీసులు చాలా హంగామా చేశారు. ప‌ట్టాభి టీష‌ర్ట్ పైకి లేచిపోయి...పొట్ట అంతా క‌నిపించేలా హ‌డావుడి, హంగామా చేశారు.
 
టీడీపీ నేత పట్టాభిరామ్‌ను మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ, పట్టాభి తరచూ నేరాలకు పాల్పడుతున్నాడని, ఇప్పటికే పట్టాభిపై 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆయన ఇతర కేసుల్లో బెయిల్‌పై ఉన్నాడని పేర్కొన్నారు. అయితే బెయిల్‌పై ఉన్నప్పటికీ పట్టాభి బెయిల్‌ ఆంక్షలను పాటించడం లేదని కోర్టుకు తెలిపారు.
 
ముఖ్యమంత్రిపై ఉద్దేశపూర్వకంగానే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, దీని వెనుక రాష్ట్రంలో అలజడి, అల్లర్లు సృష్టించాలన్నదే పట్టాభి లక్ష్యమని తెలిపారు. న్యాయ, పోలీస్‌ వ్యవస్థలను ఆయన ఖాతరు చేయడం లేదని, కేవలం స్వప్రయోజనం, రాజకీయ ప్రయోజనం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని పట్టాభికి బెయిల్‌ ఇవ్వడం కంటే.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపడమే సరైన చర్యని కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది విన్నవించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో చేసినందుకు విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు ఆయనను అరెస్టు చేసి, అతనిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదు చేశారు.