చంద్రబాబు సర్కారుకు పవన్ అల్టిమేటం.. 48 గంటల డెడ్‌లైన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అల్టిమేటం జారీచేశారు. డయేరియా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే రాష్ట్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అల్టిమేటం జారీచేశారు. డయేరియా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తానని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అవసరమైతే దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు.
ఆయన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. చనిపోయిన వారినెలాగూ తీసుకునిరాలేదు. కనీసం అత్యవసర పరిస్థితిని ప్రకటించి రోగుల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో సురక్షితమైన తాగునీటిని ప్రజలకు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా? అంటూ ఆయన అధికార పక్షాన్ని నిలదీశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు సమస్యలు పట్టవా? అని అడిగారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి అసెంబ్లీకి వైఎస్సార్సీపీ వెళ్లదని, అలాంటప్పుడు వారినేమనాలని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అవిశ్వాస తీర్మానాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ నాయకుడు జగన్‌కు అవిశ్వాసంపై అంత అయోమయం ఎందుకని ప్రశ్నించారు. తాను 5వ తేదీన అవిశ్వాసం పెట్టమని ముందుగానే సలహా ఇస్తే, దాన్ని వినలేదని, తొలుత 23న అవిశ్వాసం పెడతానని చెప్పారన్నారు. ఇప్పుడెందుకు సడన్‌గా తేదీని మార్చారని ప్రశ్నించారు.
అవిశ్వాసంపై అయోమయంలో ఆ పార్టీ ఉన్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అసలు టీడీపీ అయితే అవిశ్వాసమే అవసరం లేదని చెప్పిందని, ఇక ఇప్పుడెందుకు అవిశ్వాసం కోరుకుంటోందని పవన్ అడిగారు. తాను టీడీపీకి చెందిన మనిషిని కాదని, బీజేపీకి చెందిన వాడినీ కాదని ప్రజల మనిషినని చెప్పారు.