స్పీడు పెంచుతున్న పవన్ కళ్యాణ్ : మరో ప్రాజెక్టుకు సమ్మతం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు పెంచుతున్నారు. ఒకవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు వరుస చిత్రాల్లో నటించేందుకు కమిట్ అవుతున్నారు. నిజానికి గత రెండేళ్ళుగా ఒక్క సినిమా కూడా చేయని పవన్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి లైన్‌లో పెడుతున్నాడు.
ఇప్పటికే "వకీల్ సాబ్" షూటింగ్ పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం క్రిష్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీని తర్వాత మాలీవుడ్‌లో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు.
ఇందులో బిజూ మీనన్ పాత్రను పవన్ చేయనుండగా, రానా పాత్రను పృథ్వీరాజ్ చేయనున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు అందించేందుకు సమ్మతించడం గమనార్హం.
ఇదిలావుంటే, హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ కల్యాణ్ సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుండగా, ఇప్పుడు బండ్ల గణేష్ నిర్మాణంలో దర్శకుడు రమేష్ వర్మతో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతుంది.
రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజ హీరోగా 'ఖిలాడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక పవన్ సినిమా పనులు మొదలు పెడతాడట. ఈ లోగా పవన్ కళ్యాణ్ కూడా తాను కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.