శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (16:53 IST)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

pawan - rgv
ఫోటోల మార్ఫింగ్, అసభ్య పోస్టుల కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసులకు చిక్కకుండా పరారైన అంశంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పని తాను చేస్తున్నానని, పోలీసులు వాళ్ళ పని వారు చేస్తున్నారని పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌‌కు... ఆర్జీవీ వివాదంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో పోలీసుల ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇపుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అని మీడియా ప్రశ్నించింది. 
 
దీనిపై పవన్ స్పందించారు. నా పని నేను చేస్తున్నా.. పోలీసుల పని వాళ్లు చేస్తున్నారు అని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు. నేను చెయ్యడం లేదు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. 
 
చంద్రబాబును ఇబ్బంది పెట్టినపుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇపుడు ఎందుకు తటపటాయిస్తున్నారు అనే విషయాన్ని ముఖ్యమంత్రిని అడుగుతాను, ఈ ప్రశ్న ఢిల్లీలో మీడియా వాళ్లు అడిగారని చెప్తాను అని పవన్ అన్నారు. ఇకపోతే కేంద్ర జలశక్తి మంత్రి భైరాన్ సింగ్ షెకావత్‌తో జరిగిన సమావేశంపై ఆయన స్పందించారు. 
 
గత వైకాపా ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు వినియోగించలేదన్నారు. జల్‌జీవన్‌ బడ్జెట్‌ పెంచాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ ఇవ్వకపోవడంతో నిధులు వినియోగించలేకపోయారన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఇప్పుడు అనుభవిస్తున్నట్టు చెప్పారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని తెలిపారు. అదానీ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, గత ప్రభుత్వంలో సమోసాల కోసం రూ.9 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు.