మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 7 డిశెంబరు 2017 (19:35 IST)

జగన్‌లా కోట్లు లేవు... లోకేష్‌లా హెరిటేజ్ లేదు... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజకీయాలను డబ్బులతో చేస్తున్నారంటూ విమర్శించిన ఆయన తన వద్ద కోట్ల రూపాయల డబ్బు లేదన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన తండ్రి కోట్ల రూపాయల ఆస్తి ఇచ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజకీయాలను డబ్బులతో చేస్తున్నారంటూ విమర్శించిన ఆయన తన వద్ద కోట్ల రూపాయల డబ్బు లేదన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన తండ్రి కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చారనీ, అలాగే నారా లోకేష్‌కు ఆయన తండ్రి హెరిటేజ్ డెయిరీ వ్యాపారాన్ని అప్పగించారని అన్నారు. 
 
తనకు మాత్రం అలాంటి ఆస్తులేవీ లేవనీ, కేవలం జనసైన్యం బలంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానన్నారు. తను కేవలం సమాజానికి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చాననీ, డబ్బు లేదా పదవి కావాలంటే ఇలా వుండనని అన్నారు. డబ్బు కావాలంటే సినిమాలు చాలనీ, రాజకీయాల్లో పదవి కావాలనుకుంటే ఎక్కడో ఒకచోట ఎంపీగా పోటీ చేసి పదవి తీసుకోవచ్చన్నారు. కానీ తన లక్ష్యం సమాజంలో అంతా మెరుగైన జీవితం గడపాలనీ, అందుకోసం పోరాడుతానని తెలియజేశారు. 
 
గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ... ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నప్పుడు చేతులు కట్టుకుని మౌనంగా వుండిపోయానన్నారు. ఎందుకంటే ఓ నాయకుడిని అనుసరిస్తున్నప్పుడు ఆయన మార్గంలో నడవక తప్పదనీ, అందువల్ల ఆ నిర్ణయం తనకు ఇష్టం లేకపోయినా చూస్తూ మిన్నకుండిపోయానని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నికల పర్యటన సమయంలోనూ అల్లు అరవింద్ తనను పర్యటించాలని ఎవరో చెబితే... ఎందుకూ... అక్కడికి అల్లు అర్జున్ లేదంటే రామ్ చరణ్ వెళతారని అన్నారనీ, దానికి కారణం... ఆయన తనలో నటుడిని తప్ప సామాజిక చైతన్యం వున్న వ్యక్తిగా గుర్తించలేదని చెప్పారు. 
 
ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పార్టీలోకి కొంతమంది స్వార్థపరులు ప్రవేశించారనీ, రాజకీయాలు చేయడం చిరంజీవి గారికి తెలియదు కాబట్టి ఏసేశారంటూ వ్యాఖ్యానించారు. కానీ పవన్ కళ్యాణ్‌తో ఇలాంటివి సాధ్యం కావన్నారు. ఎందుకంటే తను చిరంజీవి అంతటి మంచి వ్యక్తిని కాదనీ, చిరంజీవి ఇంటికి పెద్ద కుమారుడు కాబట్టి ఆయన ఎంతో వినమ్రత, మంచితనంతో వున్నారన్నారు. తను ఇంట్లో చిన్నవాడిననీ, మహా ముదురునంటూ వ్యాఖ్యానించారు. సమస్య సాధనకోసం తనకు చచ్చిపోయేంత తెగింపు వుంటుందన్నారు. తన గురించి మాట్లాడేటపుడు ఎవరైనా కులం గురించి మాట్లాడవద్దనీ, తనను కుల నాయకుడిని చేయవద్దని హెచ్చరించారు. ఇంకా ఇలాంటివే మాట్లాడితే ఆఫీస్ బోయ్ నుంచి మీ మేనేజర్ల వరకూ లిస్టు బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.