బాబు కంటతడిపెట్టడం బాధ కలిగించింది... సిగ్గుతో తలదించుకోవాలి : పవన్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంటీవలికాలంలో కొందరు నేతలు వాడుతున్న భాష, మాటలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల పట్ల అధికార పార్టీకి చెందిన సభ్యులు అమర్యాదగా మాట్లాడటం అత్యంత శోచనీయమన్నారు. గతంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా కొందరు తక్కువ చేసి మాట్లాడినపుడు కూడా తాను ఇలానే ఖండించానని గుర్తుచేశారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు మహిళల గురించి మాట్లాడేటపుడు జాగ్రత్తగా వహించాలని హితవు పలికారు. మహిళల గౌరవ మర్యాదలకు హాని కలిగించే ధోరణులను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, లేకపోతే అంటువ్యాధిలా ప్రబలే అవకాశం ఉందని పవన్ పిలుపునిచ్చారు.