వైకాపా విధ్వంస పాలనలో వృక్షాలు విలపిస్తున్నాయ్.. పవన్ ట్వీట్
వైకాపా విధ్వంస పాలనలో వృక్షాలు సైతం విలపిస్తున్నాయ్ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ పర్యటనల సందర్భంగా చెట్లు నరికే ప్రక్రియపై పవన్ విమర్శలను గుప్పించారు. వైకాపా పాలనలో వృక్షాలు విలపిస్తున్నాయంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చెట్లు నరికిన ఫొటోలను ఆయన తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. విచక్షణారహితంగా చెట్లు నరకవద్దని సంబంధిత అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పాలని సూచించారు.
కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని.. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని పవన్ ఆక్షేపించారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారన్నారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జంధ్యాల పాపయ్యశాస్త్రి 'పుష్ప విలాపం' పద్యాలను పవన్ ప్రస్తావించారు.
"ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ" అనే పద్యాన్ని పవన్ పోస్ట్ చేశారు.