గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (10:41 IST)

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక

jsp meeting
జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించగా, ఆ పార్టీకి చెందిన మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలంతూ ఏకగ్రీవంగా బలపరిచారు. దీంతో పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో జనసేన పార్టీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా జనసేన దక్కించుకున్న విషయం తెల్సిందే. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైకాపా ఏగంగా అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుచుకుని కనీస ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఫలితంగా ప్రధాన ప్రతిపక్ష హోదాను జనసేన పార్టీ కైవసం చేసుకుంది. 
 
జగన్‌పై ఉన్న వ్యతిరేకతే మా కొంప ముంచింది... ఓడిన వైకాపా నేతల మనోవేదన
 
ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతే తమ కొంప ముంచిందని ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వాపోతున్నారు. 'ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం' అంటూ వారు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలై పలువురు వైకాపా అభ్యర్థులు సోమవారం తాడేపల్లిలో జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 'ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే గడప గడపకు తిరిగినప్పుడో, ఎన్నికల ప్రచార సమయంలోనైనా ఎంతో కొంత బయటపడి ఉండాలి కదా! ఎక్కడా ఆ పరిస్థితి ఎదురవలేదు. వ్యతిరేకత అంతా పోలింగ్ రోజే కనిపించడం ఊహించలేకపోయాం. జనం పల్స్ పట్టుకోలేకపోయామా అనిపించింది. రాయలసీమ ప్రాంతంలో ఎన్నికలను ప్రభావితం చేసే రెడ్డి సామాజికవర్గం ఫ్యాక్టర్ కూడా పని చేయలేదు. పూర్తిగా పార్టీ గ్రామాలనుకునే చోట కూడా ఓట్లు పడలేదు. 2019లో అయితే అప్పటి తెదేపా ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత బహిరంగంగా కనిపించింది. 
 
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మాత్రమే పూర్తి వ్యతిరేకత ఉంది, మిగిలిన వర్గాల నుంచి వ్యతిరేకత కనిపించలేదు. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందాయి కాబట్టి పాజిటివ్‌గా ఉందనే భావించాం. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నాం అని ఆ నేతలు జగన్‌కు చెప్పారు. 'మీరు స్ట్రాంగ్‌గా ఉండండి.. ఓపికగా ఉండండి.. కార్యకర్తలు అండగా నిలవండి, వారిని జాగ్రత్తగా చూసుకోండి' అని జగన్ నేతలకు సూచించారు. 
 
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ విక్రాంత్, ఓడిపోయిన నేతలు బొత్స సత్యనారాయణ, రెడ్డప్ప, తలారి రంగయ్య, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, శంకర నారాయణ, సంజీవయ్య, పుష్ప శ్రీవాణి, ఉమాబాల, బుట్టా రేణుక, రెడ్డి శాంతి, చిర్ల జగ్గిరెడ్డి తదితరులు ఉన్నారు.