శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 8 నవంబరు 2019 (17:31 IST)

ఎపి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపండి: కేంద్ర మంత్రిని కోరిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

కేంద్ర ఇంధన వనరులు, సహజ వాయివులు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను  మర్యాదపూర్వకంగా కలిసారు. ఉదయం రాజ్‌భవన్ చేరుకున్న ఆయన గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాజ్ భవన్‌లోనే అల్పాహార విందును స్వీకరించిన కేంద్రమంత్రి అనంతరం గవర్నర్‌తో పలు అంశాలను చర్చించారు.
 
ఈ నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పలు విధాలుగా నష్టపోయిందని, రాష్ట్రం అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని మంత్రిని కోరారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బిస్వ భూషణ్ కేంద్ర మంత్రిని కోరారు.
ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఓఎన్‌జిసి కెజి బేసిన్‌ను సందర్శించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. ఉక్కు శాఖను కూడా నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా రావాలని హరిచందన్‌ను కోరారు.

ఇటీవల గవర్నర్ విశాఖపట్నంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ సంస్ధను సందర్శించగా, అక్కడ చేపట్టవలసిన అభివృద్ది పనులపై కూడా వీరిరువురి మధ్య లోతైన చర్చ నడిచింది. కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.