కరోనా వైరస్ సోకినవారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లు, జెసిలు, పీహెచ్‌సీ వైద్య అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 60 సంవత్సరాల నిండిన వారు, డయాబెటిస్,హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక లక్షణాలు ఉన్న వారిని, జ్వరం, దగ్గుతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి టెస్టులు నిర్వహించాలని చెప్పారు.
వారి పరిధిలోని ప్రైమరీ ఆరోగ్య బృందం పై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.6వ విడత ఇంటింటా సర్వే కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి మెడికల్ అధికారి వారి ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే శాంపిల్స్ సేకరణ,కొవిడ్ పరీక్షలు జరిగే ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు.
అంతేగాక కరోనా లక్షణాలు కలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులకు చేయించుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. అంతేగాక టెలిమెడిసిన్,ఆరోగ్య సేతు యాప్,104 కాల్ సెంటర్ ద్వారా కూడా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
ఇతర ప్రాంతాల నుండి విమానాలు, రైళ్ళు,బస్సులు ద్వారా వచ్చిన వారి వివరాలు పిహెచ్సి డాక్టర్ వద్ద ఉంచుకుని ఆలాంటి వారి ఆరోగ్యం పట్ల నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు.
ప్రతి ఒక్కరూ బయిటకు వెళ్ళి నపుడు భౌతిక దూరాన్ని పాటించడంతోపాటు విధిగా మాస్క్ ధరించే విధంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు.
అలాగే కరోనా లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులకు చేయించుకునేలా అవగాహన కలిగించడంతో పాటు సమాజంలో కరోనా పట్ల స్టిగ్మా లేకుండా చూడాలని సిఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు.
పిహెచ్సిల్లో కోవిడ్ ఏతర వైద్య సేవలు అనగా ప్రసవాలు, వాక్సినేషన్ చర్యలు వంటి అన్ని సాధారణ వైద్య సేవలన్నీ యధావిధిగా కొనసాగించాలని మెడికల్ అధికారులకు సిఎస్ స్పష్టం చేశారు. ఆరోగ్య సేతు యాప్ ను స్మార్ట్ ఫోన్ వినియోగించే వారందరూ విధిగా వినియోగించేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.
గత మూడు మాసాలకు పైగా కొవిడ్ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నందుకు కలెక్టర్లు సహా సంబంధిత అధికారులు సిబ్బంది సేవలను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ బయటి ప్రాంతాల నుండి వచ్చిన వారు విధిగా హోం క్వారంటైన్,కొవిడ్ మైల్డ్ లక్షణాలు ఉన్న వారు హోం ఐసోలేషన్ లో ఉండేలా చూడాలని చెప్పారు.గ్రామ స్థాయి బృందాలు మరింత చురుగ్గా పనిచేసేలా చూడాలని,హైరిస్క్ వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా పాజిటివ్ లక్షణాలున్న,హైరిస్క్ కేసులు ఉంటే వెంటనే ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఇకపై ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలన్నీ శాంపిల్స్ సేకరణ పాయింట్లుగా ఉండాలని ఆయన తెలిపారు.
అదే విధంగా ప్రజలను స్వచ్చంధంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు.ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, ఆరోగ్య సేతు యాప్ ను వినియోగించేలా చూడాలని స్పష్టం చేశారు.
మాస్క్ ధరించడం అనేది ఒక సోషల్ వ్యాక్సిన్ గా భావించాల్సిన అవసరం ఉందన్నారు. వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయ్‌కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.