గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (07:43 IST)

కోచ్ పదవి కోసం రండి ప్లీజ్... బీసీసీఐ అన్వేషణ

భారత జట్టును మరింత సమర్థవంతంగా తీర్చదిద్దగల కోచింగ్ సిబ్బంది కోసం బిసిసిఐ వేట కొనసాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా కేవలం ఒక్క చీఫ్ కోచ్ పదవికోసమే దాదాపు 2వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో భారత మాజీ ఆటగాళ్లలో కేవలం ఒకరిద్దరు మాత్రమే వున్నారు.

అంతకు ముందు ఈ జాబితాలో చాలామంది పేర్లు వినిపించగా చివరకు అందులో ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇలా భారత దిగ్గజ ఆటగాళ్లు ఈ పదవిపై అనాసక్తి ప్రదర్శించడానికి కారణాలను క్రికెట్ విశ్లేషకులు కొందరు వెల్లడించారు. 
 
మొదట్లో టీమిండియా మాజీలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు కూడా కోచ్ పదవిపై ఆసక్తితో వున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే అండర్ 19 కెప్టెన్ గా ద్రవిడ్ యువ క్రికెటర్లను సమర్థవంతంగా తీర్చిదిద్దుతూ మంచి  కోచ్ గా పేరుతెచ్చుకున్నాడు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్  కు కూడా అంతర్జాతీయ క్రికెటర్ గా మంచి అనుభవం వుంది. కాబట్టి వీరిద్దరిలో ఎవరోఒకరు భారత  జట్టుకు తదుపరి  కోచ్ గా ఎంపికవనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. 
 
వీరు కూడా బిసిసిఐ విధించిన గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని భావించారట. అయితే ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే వెస్టిండిస్ పర్యటనకు వెళుతూ విరాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రవిశాస్త్రికి బహిరంగ మద్దతు ప్రకటించాడు. మళ్లీ  కోచ్ గా ఆయన్ను నియమిస్తే బావుంటుందని అన్నాడు. దీంతో సెహ్వాగ్, ద్రవిడ్ లే కాదు మరికొంత టీమిండియా మాజీలు కూడా వెనక్కి తగ్గినట్లు సమాచారం. 
 
అంతేకాకుండా భారత జట్టు కోచింగ్ సిబ్బందిని నియమించే బాధ్యతలను కూడా బిసిసిఐ సీఏసీ(క్రికెట్ అడ్వైజరీ  కమిటీ)కి అప్పగించింది. ఈ  కమిటీ సభ్యుడయిన అన్షుమన్ గైక్వాడ్ కూడా రవిశాస్త్రి పర్యవేక్షణలో టీమిండియా చాలా విజయాలు సాధించిందంటూ ఈ దరఖాస్తుల సమయంలోనే అన్నాడు.

అంతేకాకుండా అతడికే మళ్లీ చీఫ్ పదవి  చేపట్టే అవకాశాలు ఎక్కువగా వున్నాయని పేర్కోన్నాడు. ఈ వ్యాఖ్యలు కూడా టీమిండియా మాజీలతో పాటు మహేల జయవర్థనే వంటి విదేశీ  దిగ్గజాలు సైతం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోకపోడానికి కారణమని తెలుస్తోంది.