వైఎస్.వివేకా హత్య కేసు : ముగ్గురు హత్య కేసులో ముగ్గురు అరెస్టు
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. వీరిలో వివేకానంద రెడ్డి అనచురుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి వంట మనిషి కుమారుడు ప్రకాశ్‌ను అరెస్టు చేసినట్టు ఈ మేరకు పులివెందుల పోలీసులు ప్రకటించారు.
వివేకా హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాత్రూమ్‌లో ఉన్న వివేకా మృతదేహాన్ని బెడ్‌రూమ్‌కి తరలించారని, బెడ్రూమ్‌లో ఉన్న రక్తపు ఆనవాళ్లు చెరిపేసి సాక్ష్యాధారాలు తారుమారు చేశారని భావించిన పోలీసులు, ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే వున్నాడని నిర్ధారించారు.
వివేకా రాసిన లేఖ ఉదయం సమయంలోనే దొరికినా, సాయంత్రం దాకా ఇవ్వలేదని పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టు ఎదుట పోలీసులు హాజరుపర్చారు.
మరోవైపు, వివేకానంద రెడ్డి హత్యకేసులో దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించింది. పిటిషర్ల తరపున న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సిట్ పేరుతో వైఎస్ కుటుంబ సభ్యులపై బురదజల్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని న్యాయవాదులు కోర్టుకు వివ్నవించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో లేని దర్యాప్తు సంస్థకు కేసు విచారణ అప్పగించాలని కోరారు.